Experimental Telugu Movies: ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?

ఈ ఏడాది విడుదలై, ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్న ప్రయోగాత్మక చిత్రాలపై ప్రత్యేక కథనం.

Published : 03 Jul 2024 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఎప్పుడూ ఈ యాక్షన్‌ చిత్రాలేనా? మళ్లీ రొటీన్‌ లవ్‌స్టోరీనా? విభిన్న కథల్లేవా?’.. మీరూ ఇలా ఫీలయ్యే వారి జాబితాలో ఉన్నారా? మీలాంటి వారి కోసమే ప్రతి ఏడాదీ పలు ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కుతుంటాయి. ఓవైపు స్టార్‌ హీరోల ప్రాజెక్టులు యాక్షన్‌తో విజిల్స్‌ వేయిస్తే, మరోవైపు విభిన్న కథా చిత్రాలు కొత్త అనుభూతి పంచే ప్రయత్నం చేస్తుంటాయి. అలా ఈ ఏడాది ఆర్నెల్లలో వచ్చిన మూవీస్‌ ఏంటి? ప్రస్తుతం ఏ ఓటీటీలో ఏది అందుబాటులో ఉంది? చూద్దాం..

ఒకే ఒక్కరు..!

ఏదైనా చిత్రంలో ఓ పాత్రధారి నట విశ్వరూపం చూపిస్తే ‘వన్‌మ్యాన్‌ షో’ అంటూ సినీ ప్రియులు ప్రశంసలు కురిపించడం సాధారణం. మరి, ఒకే ఒక్కరితో సినిమా రూపొందితే? ఆ థ్రిల్‌ను ప్రేక్షకులను అందించింది ‘105 మినిట్స్‌’ (105 Minuttess) చిత్ర బృందం. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ఆ మూవీలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. రాజు దుస్సా దర్శకత్వం వహించారు. ఆరు రోజుల్లోనే చిత్రీకరణ పూర్తవడం విశేషం. జాను (హన్సిక) ఇంట్లో ఓ అదృశ్య శక్తి ఉంటుంది. తన మరణానికి జానునే కారణమని ఆ శక్తి ఆమెను రోజూ భయపెడుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాను ఆ ఇంటి నుంచి ఎలా బయటపడింది? ఆ వ్యక్తి మరణానికి జాను ఎలా కారణమైంది? అన్నది కథాంశం. ఓటీటీ వేదికలు: ఆహా (Aha), అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (అద్దె ప్రాతిపదికన) (Amazon Prime Video).

మనిషి మాయమవడమేంటి?

ఓ జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? ఈ ఆసక్తికర అంశంతో రూపొందిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). డెజావు కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ తెరకెక్కించిన ఈ మూవీలో కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రధారి. సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

దెయ్యంతో ప్రేమ

తన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే వారిని హతమార్చే దివ్యవతి అనే దెయ్యాన్ని.. అర్జున్‌ అనే యువకుడు ప్రేమించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అతడెలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? మనుషులను వదిలేసి ఎందుకు దెయ్యానికే ప్రేమను పంచాలనుకున్నాడు? తెలియాలంటే ‘లవ్‌ మీ’ (Love Me) చూడాల్సిందే. ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రమిది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో పోరాటం

ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన ప‌డిన ఓ రేడియా జాకీ.. తన కళ్ల ముందు హత్య జరగ్గా పోలీసులకు సమాచారం ఇస్తాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేని అతడు హత్యకు సంబంధించిన వివరాలు ఎలా చెప్పగలిగాడు? ఆ కేసులో తనే చిక్కుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరు ఇరికించారు? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam) సినిమా కథాంశం. సుహాస్‌ (Suhas) హీరో. పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా.

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో..

ప్రయోగాలకు ముందుండే ప్రముఖ హీరోల్లో మమ్ముట్టి (Mammootty) ఒకరు. ‘భ్రమయుగం’ (Bramayugam) సినిమాతో ప్రేక్షకులను నాటి కాలంలోకి తీసుకెళ్లారు. డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం విశేషం. రాహుల్‌ సదాశివన్‌ దర్శకుడు. ఓ పాడుబడ్డ భవనంలో.. తాంత్రిక విద్యలు నేర్చిన మంత్రగాడి బారి నుంచి ఓ యువకుడు ఎలా తనని తాను రక్షించుకున్నాడన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని