Chiranjeevi: ‘విశ్వంభర’ డబ్బింగ్‌ మొదలు

ఒకవైపు చిత్రీకరణ... మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Published : 05 Jul 2024 01:31 IST

కవైపు చిత్రీకరణ... మరోవైపు నిర్మాణానంతర పనులతో ‘విశ్వంభర’ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. గురువారం డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అత్యున్నత స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వాటితోపాటు, నిర్మాణానంతర పనుల్లో మరింత నాణ్యతకోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శకుడు. చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలు. కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి హనుమాన్‌ భక్తుడిగా కనిపించనున్నారు. 

ఆనవాయితీ కొనసాగిస్తూ... 

ఈ సినిమా మ్యూజిక్‌ కంపోజ్‌ ప్రక్రియ తన ఇంట్లోనే జరిగిందంటూ, అందుకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు చిరంజీవి. గురువారం సంగీత దర్శకుడు కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోని విడుదల చేస్తూ, ‘ఆపద్బాంధవుడు’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఒకప్పుడు అందరం ఒక చోట చేరి, సంగీత దర్శకుడి ఊహల్లో ప్రవహిస్తున్న బాణీలు బాగున్నాయో లేవో చర్చించుకునేవాళ్లం. ఆ తర్వాతే పాట బయటికొచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ... మళ్లీ మా కీరవాణి ‘విశ్వంభర’ కోసం పాటల్ని కంపోజ్‌ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మా పాత రోజులు గుర్తొచ్చాయి. ‘ఆపద్బాంధవుడు’ సంగీతం కంపోజ్‌ చేసే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ నాటి ఆ మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తీయని అనుభూతికి లోనైంది’’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు చిరంజీవి. ఈ వీడియోలో ‘ఆపద్బాంధవుడు’లోని ‘చుక్కల్లారా...’ పాటని కీరవాణి ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని