Ante Sundaraniki: ‘నవ్విస్తూనే.. విషయం చెప్పేశాం’

‘‘నవ్వులూ, బలమైన భావోద్వేగాలూ నిండి ఉన్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. వినోదంతో పాటు మంచి సందేశాన్నీ అందిస్తుంది’’ అన్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’.

Updated : 05 Jun 2022 09:12 IST

‘‘నవ్వులూ, బలమైన భావోద్వేగాలూ నిండి ఉన్న చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. వినోదంతో పాటు మంచి సందేశాన్నీ అందిస్తుంది’’ అన్నారు దర్శకుడు వివేక్‌ ఆత్రేయ. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. నాని, నజ్రియా జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. సంగతులు ఆయన మాటల్లోనే..

‘అంటే.. సుందరానికీ’ కథని ఐదేళ్ల క్రితమే రాసుకున్నా. ఆ ఆలోచనని మొదట శ్రీవిష్ణుతో పంచుకున్నా. చాలా ఉత్సుకతగా ఉంది, నానితో చేస్తే బాగుంటుంది అనుకున్నాం. వాస్తవానికి అప్పటికింకా కథని పూర్తిగా సిద్ధం చేసుకోలేదు. ‘బ్రోచేవారెవరురా’ సినిమా విడుదలయ్యాక పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధం చేసుకున్నా. తర్వాత నానికి కథ మొత్తం వినిపించా. అది వింటున్నంతసేపూ ఆయన చాలా ఎంజాయ్‌ చేశారు. వెంటనే చేద్దామన్నారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది. ఈ సినిమాలో కథ, పాత్రలే కనిపిస్తాయి తప్ప ప్రత్యేక ఎలివేషన్లు ఏమీ ఉండవు.

నవ్వించే సందేశం

సుందర్‌ ప్రసాద్‌ అనే బ్రాహ్మణ యువకుడు, లీలా థామస్‌ అనే క్రిస్టియన్‌ అమ్మాయి మధ్య జరిగే కథ ఇది. దీనికి గతంలో వచ్చిన ‘సీతాకోక చిలుక’కు ఎలాంటి సంబంధం లేదు. సంప్రదాయవాద సమాజం నుంచి ఎలా బయటకు రావాలి.. ఎలాంటి సందర్భంలో దాని నుంచి బయటకొస్తామన్నది సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. అది కూడా ఏదో క్లాస్‌ పీకినట్లు కాకుండా.. చాలా సున్నితంగా, పాత్రల మాటలతోనే వినోదాత్మకంగా చెప్పించే ప్రయత్నం చేశాం. ఈ చిత్రం ఏ మతాన్ని, సంఘాన్ని కించపరచదు. సంభాషణలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి.

కొత్త నాని

బారిస్టర్‌ పార్వతీశం నవలంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఓ చిన్న ఎపిసోడ్‌ కోసం ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకున్నా. నాని పంచెకట్టులో యూఎస్‌కు వెళ్లడమన్నది దాని ఆధారంగానే రాసుకున్నా. ఆ చిన్న ఎపిసోడ్‌ తప్ప ఈ కథకు పార్వతీశం పాత్రకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ సినిమాలో నాని చాలా కొత్తగా, సరదా వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన మాట్లాడే ప్రతి మాట వెనుక.. ఒక బాధ, ఫన్‌ కలిసి ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం ఏ నటుడికైనా సవాల్‌గానే అనిపిస్తుంది.

చాలానే చెప్పాం

ఈ సినిమాలో లీలా థామస్‌ పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. నటనకు ఆస్కారమున్న ఇలాంటి బరువైన పాత్ర పోషించడానికి నజ్రియా లాంటి ప్రతిభావంతురాలైన నటి అయితేనే బాగుంటుంది. అందుకే ఈ పాత్ర కోసం ఆమెని సంప్రదించాం. కథ వినిపించిన వెంటనే నచ్చి.. ఒప్పుకుంది. సెట్లో ఆమె కానీ, నాని గానీ పెద్ద స్టార్లలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. దానివల్ల నాకు కావాల్సిన స్వేచ్ఛ దొరికినట్లయింది. ఈ చిత్రం పూర్తిగా కులాంతర, మతాంతర వివాహాలపై తీసినదైతే కాదు. సినిమాలో ఇంకా చాలా విషయాలు చర్చించాం.

అది నా బలం

పరువు హత్యలు ఇప్పటికీ అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అవెంత క్రూరంగా ఉంటున్నాయో.. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కులాంతర, మతాంతర వివాహాల విషయంలో ఎదురవుతున్న సమస్యల్ని నేనిందులో వినోదాత్మక కోణంలో చూపించనున్నా. ఎందుకంటే మనం ఒక మంచి విషయాన్ని నవ్విస్తూ.. సరైన సందర్భంలో చక్కగా చెప్పగలిగితే అదెక్కువ మందికి రీచ్‌ అవుతుందని నమ్ముతా. అందుకే నా సినిమాల్లో ఎంత సీరియస్‌ విషయాన్నైనా హాస్యంతో మిళితం చేసి చెప్పే ప్రయత్నం చేస్తుంటా. అదే నా బలం.

యాక్షన్‌ డ్రామా

ప్రతి సినిమాకీ నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటా. అందుకే ఎప్పటికప్పుడు కొత్త జానర్లతో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ అలా చేయలేదంటే ప్రేక్షకులకే కాదు, నాకు నేనే బోర్‌ కొట్టేస్తా. నాకు యాక్షన్‌ డ్రామాలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో మంచి యాక్షన్‌ డ్రామా చేయాలనుంది. నా తర్వాతి చిత్రం ఇంకా ఖరారవ్వలేదు. కొన్ని కథాలోచనలున్నాయి. టైమ్‌ కుదిరితే ఓటీటీ కోసం కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు చేయాలనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని