Naga Chaitanya: నాగ చైతన్యతో సినిమా చేయకపోవడానికి కారణమదే: ‘నాంది’ దర్శకుడు

నాగచైతన్యతో సినిమా ఎందుకు తీయలేదో దర్శకుడు విజయ్‌ కనకమేడల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భవిష్యత్తులో తమ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని అభిప్రాయపడ్డారు.

Published : 20 Apr 2023 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: హీరో అల్లరి నరేశ్‌తో ‘నాంది’ (Naandhi) సినిమాని తెరకెక్కించి, తొలి ప్రయత్నంలోనే దర్శకుడు విజయ్‌ కనకమేడల (Vijay Kanakamedala) మంచి గుర్తింపు పొందారు. తదుపరి చిత్రం ఏ హీరోతో చేస్తారా? అని సినీ ప్రియులు ఎదురుచూస్తుండగా మళ్లీ నరేశ్‌తోనే అంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘ఉగ్రం’ (Ugram) మే 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘నాంది’ తర్వాత జరిగిన పరిణామాలపై స్పందించారు. ఓ కథకు సంబంధించిన క్లైమాక్స్ విషయంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) సంతృప్తి చెందకపోవడంతో ఆయనతో సినిమా తీయలేదని, భవిష్యత్తులో అది కార్యరూపం దాల్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘నాంది’ విజయం తర్వాత విజయ్‌.. నాగ చైతన్య సహా పలువురు కథానాయకులకు ఓ స్టోరీ వినిపించారట. ఆ కథ చైతన్యకు నచ్చిందని, అయితే 15 నిమిషాల క్లైమాక్స్‌ సీన్‌ విషయంలో ఆయన సంతృప్తిగా లేరని, కథ విషయంలో హీరో- దర్శకుడు మధ్య భిన్నాభిప్రాయాలుంటే ఔట్‌పుట్‌ సరిగా రాదనే ఉద్దేశంతోనే సినిమాని పట్టాలెక్కించలేదని విజయ్‌ తెలిపారు. ఆ తర్వాత తాను ‘ఉగ్రం’ సినిమాతో బిజీ అయ్యానని, నాగచైతన్య.. దర్శకుడు వెంకట్‌ ప్రభు చిత్రాన్ని (కస్టడీ) ఖరారు చేశారని చెప్పారు. తాము తరచూ కలుసుకుంటుంటామని, కచ్చితంగా సినిమా చేద్దామని చైతూ అంటారని విజయ్‌ పేర్కొన్నారు. ముందుగా.. తామిద్దరు అనుకున్న విధంగా కాకుండా ఆ క్లైమాక్స్‌ విషయంలో మరో కొత్త ఆలోచన ‘ఉగ్రం’ సినిమా చిత్రీకరణ సమయంలో వచ్చిందన్నారు. ఆ కథ వేరే హీరోతోనైనా తెరకెక్కవచ్చని, కుదిరితే నాగ చైతన్యతోనే చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ‘నాంది’లో.. చేయని నేరానికి జైలు పాలైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కనిపించిన అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’లో పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని