Shankar: ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్‌ శంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘భారతీయుడు 2’లోని కమల్‌ నటించిన ప్రతి సన్నివేశం పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు దర్శకుడు శంకర్‌. ఆ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు.

Updated : 02 Jun 2024 10:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారతీయుడు 2’ (Indian 2)లోని కమల్‌ హాసన్‌ (Kamal Haasan)కు సంబంధించిన ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే అంటూ అంచనాలు రెట్టింపు చేశారు ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar). ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో విడుదల వేడుక (Indian 2 Audio Launch)ను శనివారం రాత్రి నిర్వహించింది. ఆ వేదికపై శంకర్‌ మాట్లాడుతూ.. ప్రతి సీన్‌లోనూ కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని తెలిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో తొలిసారి కలిసి పనిచేశానని, ఆరు మంచి పాటలు అందించారని ప్రశంసించారు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో కనిపించదని, ‘భారతీయుడు 3’లో ఆమె పాత్ర ఉంటుందన్నారు.

వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు లోకేశ్‌ కనగరాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. శంకర్‌, కమల్‌, అనిరుధ్‌లను నేనెప్పుడు కలిసినా ఈ మూవీ అప్‌డేట్స్‌ అడుగుతుండేవాడిని’’ అని అన్నారు.

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పలు సమస్యలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ సహకారంతో ఈ ప్రాజెక్టు పునః ప్రారంభమైందంటూ ఆయనకు థ్యాంక్స్‌ చెప్పారు కమల్‌ హాసన్‌. ఈ ప్రాజెక్టులో భాగమైన కాజల్ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈవెంట్‌లో పాల్గొని, సందడి చేశారు. మౌనీరాయ్‌ తన డ్యాన్స్‌తో, అనిరుధ్ పాటలతో అలరించారు. బ్రహ్మానందం, శింబు తదితరులు సైతం హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. సంబంధిత విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 1996లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా రూపొందుతోంది ‘భారతీయుడు 2’. అవినీతిపరుల భరతం పట్టేందుకు స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్‌ మరోసారి నట విశ్వరూపం చూపించనున్నారు. సిద్ధార్థ్‌, ప్రియా భవానీశంకర్‌, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 3’ రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు