Shankar: అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్‌ 3 రిలీజ్‌ అప్పుడే: శంకర్‌

‘భారతీయుడు’ విడుదలైన 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. అంత గ్యాప్‌ ఎందుకొచ్చిందో దర్శకుడు శంకర్‌ తెలిపారు.

Published : 02 Jul 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారతీయుడు’ (Bharateeyudu) విడుదలైన 28 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌ వస్తోంది. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా  తెరకెక్కిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్‌ 2 (Bharateeyudu 2) రూపొందించేందుకు అంత గ్యాప్‌ ఎందుకు వచ్చిందో దర్శకుడు శంకర్‌ (Director Shankar) తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వివరించారు. పార్ట్‌ 3 ఎప్పుడు రానుందో తెలిపారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

అందుకే ఆలస్యమైంది..

‘‘భారతీయుడు’ తర్వాత నేను వేరే ప్రాజెక్టులతో బిజీ అయ్యా. అప్పటికి పత్రికల్లోనో టీవీల్లోనో లంచం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘మళ్లీ భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. మరోవైపు, చెప్పాలనుకున్న విషయాన్ని ‘భారతీయుడు’లోనే చెప్పేశాం.. సీక్వెల్‌ అవసరమా అనుకున్నా. ఆ సందేహంలోనే సంవత్సరాలు గడిచాయి. అవినీతి ఇంకా అలానే ఉందని న్యూస్‌ పేపర్లు, టీవీలు మళ్లీ గుర్తుచేశాయి. అప్పుడే ‘భారతీయుడు’ పార్ట్‌ 2 తీయాలని నిర్ణయించుకున్నా. ‘2. ఓ’ సినిమా పూర్తయిన తర్వాత ‘భారతీయుడు 2’ స్క్రిప్టు రెడీ చేశా. 2019లో సినిమాని ప్రారంభించాం. సీక్వెల్‌ తెరకెక్కించడం ఓ సవాలు. తొలి భాగం నేపథ్యమేంటో, అందులోని పాత్రల తీరు ఎలాంటిదో ప్రేక్షకులకు తెలుసు కాబట్టి రెండో భాగం అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టే ఈ సీక్వెల్‌ ఉంటుంది’’

పార్ట్‌ 3.. మరో ఆరు నెలల్లో!

‘‘ఒక రాష్ట్రంలో జరిగే కథతో భారతీయుడు పార్ట్‌ 1 తెరకెక్కింది. దాని నిడివి 3 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో జరిగే కథగా చూపించబోతున్నాం. అందుకే నిడివి పెరిగింది. ప్రతి సన్నివేశం ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. ఎడిటింగ్‌లో ఒక్క సీన్‌నూ తీసేయడానికి నా మనసు అంగీకరించలేదు. ఆ కారణంగానే రెండు భాగాలుగా తీసుకొస్తున్నా. మరో ఆరు నెలల్లో ‘భారతీయుడు 3’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పార్ట్‌ 3లోనే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంది’’

వాటికీ సీక్వెల్‌..!

‘‘ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ తదితర చిత్రాలకు సీక్వెల్‌ తీయమని కొందరు నన్ను అడిగారు. ఆ సినిమాలకు పార్ట్ 2లు తెరకెక్కించాలని ఒకానొక సమయంలో నాకూ అనిపించింది. కానీ, నామమాత్రంగా వాటిని తీయకూడదు. సమయం వచ్చినప్పుడు బలమైన కథలతో తెరకెక్కిస్తా. ఏఆర్‌ మురుగదాస్‌, అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ తదితర దర్శకులు విభిన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందుకు వారిని ప్రశంసిస్తున్నా. ఇటీవల చూసిన చిత్రాల్లో  ‘12th ఫెయిల్‌’ నాకు బాగా నచ్చింది’’ అని తెలిపారు.

సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని