Shankar: రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అర్జున్‌: ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’పై శంకర్‌ ఏమన్నారంటే?

తానెందుకు సినిమాటిక్‌ యూనివర్స్‌లో చిత్రాలు తెరకెక్కించలేదన్న ప్రశ్నపై దర్శకుడు శంకర్‌ స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

Published : 29 Jun 2024 09:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పాన్‌ ఇండియా’లానే ‘సినిమాటిక్‌ యూనివర్స్‌’ పదం చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఓ సినిమా కథా ప్రపంచాన్నో, అందులోని పాత్రలనో మరో సినిమాలో కొనసాగించడమే యూనివర్స్‌. హాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్‌ను బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ఫాలో అవుతున్నాయి. ఆ కాన్సెప్ట్‌ను దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్‌ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ది (Lokesh Cinematic Universe). ‘ఖైదీ’ (2019), ‘విక్రమ్‌’ (2022) సినిమాలు ఆ కోవకు చెందినవే. 2008లోనే ఆ సాహసం చేయాలని ప్రయత్నించారు డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar). కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఏయే సినిమాల్లోని పాత్రలతో ఆయన యూనివర్స్‌ క్రియేట్‌ చేద్దామనుకున్నారు? ఎందుకు తెరకెక్కించలేకపోయారు? ఆయన మాటల్లోనే (Shankar Cinematic Universe)..

‘‘ ‘రోబో’ చిత్రీకరణ సమయంలో నాకు సినిమాటిక్‌ యూనివర్స్‌ ఆలోచన వచ్చింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’లోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్టు తీయాలనే ఆసక్తి కలిగింది. వెంటనే నా అసిస్టెంట్‌ డైరెక్టర్లను పిలిచి ఆ విషయం చెప్పా. ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వారు. అది వారికి నచ్చలేదని అర్థం చేసుకున్నా. తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులకు వివరించా. వారి నుంచీ ఆశించిన స్పందన రాలేదు. వారంతా సపోర్ట్‌ చేయకపోవడంతో నా ఆలోచనే కరెక్ట్‌ కాదేమోనని ఊరుకున్నా. కొన్నాళ్ల తర్వాత ‘అవెంజర్స్‌’ (మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌- హాలీవుడ్‌) మూవీ చూశాక.. ‘భవిష్యత్తులో మీకు కొత్త తరహా కాన్సెప్ట్‌లతో సినిమా తీయాలనిపిస్తే వెంటనే తీసేయండి. లేదంటే ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు’ అని నా అసిస్టెంట్లకు చెప్పా’’ అని తన తాజా చిత్రం ‘భారతీయుడు 2’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ వివరించారు. ఒకవేళ ఆయన అనుకున్నది సాధ్యమై ఉంటే ‘శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఫస్ట్‌ యూనివర్స్‌గా నిలిచి ఉండేది. ఆ మూడు సినిమాలు, అందులోని కథానాయకుల పాత్రలు ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.

‘2. ఓ’ తర్వాత శంకర్‌ దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ (Bharateeyudu) జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు, రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) తెరకెక్కిస్తున్నారు.

సేనాపతికి అప్పుడు 75.. ఇప్పుడు 103.. లాజిక్‌ ఏంటో చెప్పిన శంకర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని