T20 World Cup 2024: టీమ్‌ఇండియా విజయం.. సినీ ప్రముఖుల ఆనందం.. ఎవరేమన్నారంటే?

టీమ్‌ఇండియా విజయంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.

Updated : 30 Jun 2024 12:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2024 టీ 20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)లో భారత్‌ జయకేతనం ఎగరేసింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. దీంతో, దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిత్ర పరిశ్రమలోనూ జోష్‌ కనిపిస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీమ్‌ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘భారత్‌ ప్రపంచంలో టాప్‌లో ఉంది. 17 ఏళ్ల తర్వాత టీ 20 వరల్డ్ కప్‌ గెలవడం ఆనందంగా ఉంది. విరాట్‌ కోహ్లీ, బుమ్రా, హార్దిక్, అక్షర్, అర్షదీప్‌, కెప్టెన్‌ రోహిత్ రోహిత్‌ శర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్ క్యాచ్‌ వావ్‌ అనిపించింది’’ - చిరంజీవి

‘‘విజయం మనదే. అలుపెరగకుండా పోరాడిన టీమ్‌ఇండియాకు అభినందనలు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చరిత్రాత్మక విజయం చూస్తే ఎంతో గర్వంగా ఉంది’’ - మహేశ్‌బాబు 

‘‘భారత్‌కు అనూహ్య విజయం. భారతజట్టు ప్రదర్శన అమోఘం. జస్‌ప్రీత్‌ బుమ్రా అదరహో. విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యా పెర్ఫామెన్స్‌ అద్భుతం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు వందనాలు. ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించిన భారత జట్టుకు శుభాకాంక్షలు’’ - రామ్‌ చరణ్‌ (Ram Charan)

‘‘అద్భుతమైన మ్యాచ్‌ ఇది. ఎంతో గర్వంగా ఉంది. కంగ్రాట్స్‌ టీమ్‌ఇండియా’’ - ఎన్టీఆర్‌ (NTR)

‘‘టీ 20 వరల్డ్‌ కప్‌ విజేత టీమ్‌ఇండియాకు కంగ్రాట్స్‌’’ - అల్లు అర్జున్‌

‘‘కంగ్రాట్స్‌ టీమ్‌ఇండియా. ఈ మ్యాచ్‌ను ఎంతగానో ఆస్వాదించా. భారతీయులందరూ గర్వించేలా చేశారు’’ - ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)

‘‘ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోహ్లీ యాంకరింగ్‌ ఇన్నింగ్స్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌, సూర్య కుమార్‌ క్యాచ్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రశంసనీయం. ఇది చరిత్రాత్మక విజయం. నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌ భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. మనం ఛాంపియన్స్‌, మనం అజేయులం, మనం భారతీయులం’’ - కమల్‌ హాసన్‌ (Kamal Haasan)

‘‘సమయం వచ్చింది.. భారత్‌ గెలిచింది’’ - ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌

‘‘లవ్‌ యూ ఛాంపియన్స్‌. ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్‌ను మాకు ఇచ్చినందుకు భారతజట్టుకు కృతజ్ఞతలు. జై హింద్‌’’ - సాయి ధరమ్‌ తేజ్

‘‘మ్యాచ్‌ గెలిచామన్న భావోద్వేగంతో ప్లేయర్స్‌ కంటతపడి పెట్టుకున్న దృశ్యాలను టీవీలో చూసిన నా కుమార్తె చలించింది. ఎవరైనా వారిని ఆలింగనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంది. డార్లింగ్‌ నువ్వు బాధపడకు.. వారిని 150 కోట్ల భారతీయులు ప్రేమతో కౌగిలించుకుంటున్నారు. ఛాంపియన్స్‌ కంగ్రాట్స్‌. విరాట్‌ కోహ్లీ.. నువ్వు నా వాడివి అని చెప్పుకొనేందుకు కృతజ్ఞురాలిని’’ - అనుష్క శర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని