chandramukhi 2 ott: ఓటీటీలో ‘చంద్రముఖి2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

chandramukhi 2 ott: లారెన్స్‌ కీలక పాత్రలో పి.వాసు రూపొందించిన చంద్రముఖి2 ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Published : 21 Oct 2023 13:08 IST

హైదరాబాద్‌: రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ కీలక పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో రూపొందిన హారర్‌ చిత్రం ‘చంద్రముఖి-2’. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 26వ తేదీ (chandramukhi 2 ott release date) నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను పంచుకుంది. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘చంద్రముఖి2’ స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే: రంగనాయకి (రాధిక శరత్‌ కుమార్‌)ది పెద్ద కుటుంబం. అయితే ఆ కుటుంబాన్ని అనేక సమస్యలు వేధిస్తుంటాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే వేటయ్యపాలెంలో ఉన్న వారి కుల దైవం దుర్గమ్మ గుడిలో పూజ జరిపించాలని స్వామీజీ (రావు రమేష్‌) సలహా ఇస్తారు. దీంతో రంగనాయకి కుటుంబ సమేతంగా వేటయ్యపాలెం పయనమవుతుంది. ఆ కుటుంబానికే చెందిన మరో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మదన్‌ (రాఘవ లారెన్స్‌) కూడా ఆ ఊరు వస్తాడు. వారంతా కలిసి అక్కడే గుడికి సమీపంలో ఉన్న చంద్రముఖి ప్యాలెస్‌ (తొలి చంద్రముఖి సినిమా కథ జరిగిన ప్యాలెస్‌)లోకి అద్దెకు దిగుతారు. అయితే ఆ ఇంట్లోకి అడుగు పెట్టి.. దుర్గ గుడిలో పూజలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి రంగనాయకి కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. 17ఏళ్ల క్రితం బయటకి వెళ్లిపోయిన చంద్రముఖి ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మళ్లీ తిరిగొచ్చిన చంద్రముఖి 200 ఏళ్ల క్రితం చనిపోయిన వేటయ్య రాజు అలియాస్‌ సెంగోటయ్య (లారెన్స్‌) మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంది. వీళ్లిద్దరి కథేంటి? వీరి కథ ఎలా కంచికి చేరింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

‘చంద్రముఖి2’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని