kalki 2898 ad: ఆయనే ‘వైజయంతీ మూవీస్‌’ అని పేరు పెట్టారు

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘వైజయంతీ మూవీస్‌’ అసలు ఎలా ఏర్పాటైందో తెలుసుకుందామా!

Updated : 22 Jun 2024 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘వైజయంతీ మూవీస్‌’ (vyjayanthi movies) బ్యానర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు అశ్వనీదత్‌. ప్రస్తుతం కుమార్తెలతో కలిసి భారీ బడ్జెట్‌ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్‌పై తాజాగా విడుదల కానున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్‌ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకువచ్చేందుకు సిద్ధమైంది. అసలు ‘వైజయంతీ మూవీస్‌’ ఎలా పుట్టింది? ఎవరు ఆ పేరు పెట్టారంటే..

అశ్వనీదత్‌కు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ అంటే విపరీతమైన అభిమానం. సినిమాలపై ఉన్న మక్కువతోనే తండ్రిని ఒప్పించి నిర్మాణ రంగంవైపు వచ్చారు. అలా 19ఏళ్ల వయసులో సావరిన్‌ సినీ ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్‌పై విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘ఓ సీత కథ’ తీశారు. అప్పుడే తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని అనుకున్నారు. ఓ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లి, విషయం చెప్పారు. అది విని ఆయన ఆశ్చర్యపోయారట. ‘ఒకే అంతదూరం నుంచి మంచి సినిమా తీయడానికి వచ్చావు. బాగుంది. ఇంత చిన్న వయసులో సినిమా తీస్తున్నావు గ్రేట్‌. కానీ, నాతో సినిమా ఏంటి? అసలు నా సినిమా మార్కెట్‌ ఏంటో నీకు తెలుసా?’ అన్నారట. ‘నాకవన్నీ తెలియదు. మీతో సినిమా తీయాలంతే’ అని అశ్వనీదత్‌ అనడంతో ఎన్టీఆర్‌ నవ్వి ఊరుకున్నారు.

అలా రెండు, మూడు సార్లు ఎన్టీఆర్‌ను కలిసి సినిమా ప్రతిపాదన చెబితే, అశ్వనీదత్‌ పట్టుదల చూసి, ‘బాపయ్య అని మంచి కుర్రాడున్నాడు. నువ్వెళ్లి కలువు’ అని చెప్పారు. ఆ తర్వాత  దర్శకుడు కె.బాపయ్య, ఎంఎస్‌రెడ్డిలను పిలిచి సినిమా తీసే ఏర్పాటు చేశారు. ఇక కాల్షీటుపై సంతకం పెడుతూ, ‘సంస్థకేం పేరు పెట్టారు’ అని అడిగితే, ‘కృష్ణుడి మీద పెట్టాలనుకుంటున్నాను. మీరే పెట్టండి’ అని అశ్వనీదత్‌ అనడంతో కృష్ణుడి మెడలో వైజయంతిమాల ఉంటుంది కదా! దాని గుర్తుగా ఎన్టీఆర్‌ తన స్వహస్తాలతో ‘వైజయంతీ మూవీస్‌’ అని రాశారు. అలా ‘ఎదురులేని మనిషి’ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదే చిత్రాన్ని ‘జానీ మేరే నామ్‌’ పేరుతో దేవానంద్‌ హిందీలో రీమేక్‌ చేశారు. ఇక రెండో సినిమా కూడా వైజయంతీ మూవీస్‌ ఎన్టీఆర్‌తోనే తీయడం గమనార్హం. కె.బాపయ్య దర్శకత్వంలోనే ‘యుగ పురుషుడు’ తీసి రికార్డు సృష్టించారు. అలా మొదలైన ‘వైజయంతీ మూవీస్‌’ బ్యానర్‌ ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాదు, సినీ నిర్మాణ రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని, విజయపథంలో ముందుకు సాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని