baak movie review: రివ్యూ : బాక్‌.. తమన్నా, రాశీఖన్నాల హారర్‌ మూవీ ఎలా ఉంది

baak movie review: ‘అరణ్‌మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్‌’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 25 Jun 2024 16:42 IST

baak movie review; చిత్రం: బాక్‌; నటీనటులు: సుందర్‌ సి., తమన్నా, రాశీఖన్నా, యోగిబాబు, వీటీవీ గణేశ్‌, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్‌, కోవై సరళ; సంగీతం: హిప్‌హాప్‌ తమిళ; సినిమాటోగ్రఫీ: కృష్ణస్వామి; ఎడిటింగ్‌: ఫెన్నీ ఓలీవర్‌; నిర్మాత:....... రచన, దర్శకత్వం: సుందర్‌ సి.; విడుదల: 03-05-2024

త‌మిళంలో ‘అర‌ణ్మ‌ణై’ పేరుతో ఫ్రాంచైజీ చిత్రాల్ని రూపొందిస్తున్నారు సుంద‌ర్‌.సి. అవి తెలుగులోనూ అనువాద‌మ‌వుతూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. చంద్ర‌క‌ళ‌, రాజ్ మ‌హ‌ల్ త‌దిత‌ర చిత్రాలు అందులో ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన నాలుగో చిత్రమే ‘బాక్‌’. తెలుగులోనూ అదే పేరుతో విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? (baak movie review) గ‌తంలో వ‌చ్చిన సినిమాల్లా భయ‌పెట్టిందా లేదా?

కథేంటంటే: శివశంక‌ర్ (సుంద‌ర్‌.సి) ఓ న్యాయ‌వాది. అత‌ని సోద‌రి శివాని (త‌మ‌న్నా). త‌న మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది శివాని. అది క‌న్న‌వాళ్ల‌కి మింగుడు ప‌డ‌దు. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమంటారు. శివాని భ‌ర్త, పిల్ల‌ల‌తో క‌లిసి క‌న్న‌వాళ్ల‌కి దూరంగా బతుకుతుండ‌గా... ఉన్న‌ట్టుండి ఆత్మహ‌త్యకి పాల్ప‌డుతుంది. ఆమె భ‌ర్త కూడా అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణిస్తాడు. ఈ ప‌రిణామాలపై శివ‌శంక‌ర్‌కి అనుమానాలు రేకెత్తుతాయి. త‌న సోద‌రి ఆత్మహ‌త్య చేసుకోద‌ని గ‌ట్టిగా న‌మ్ముతాడు. ఆ ఇద్దరి మ‌ర‌ణాల వెన‌క కార‌ణాల్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి విష‌యాలు తెలిశాయి?(baak movie review) శివాని నిజంగానే ఆత్మ‌హ‌త్య చేసుకుందా లేక హ‌త్య‌నా?ఈ ప‌రిణామాల వెన‌క బాక్ అనే దుష్ట‌శ‌క్తి ప్ర‌మేయం ఏమిటి? త‌న చెల్లెలు మ‌ర‌ణానికి కార‌కులైన‌ వాళ్ల‌పై శివ‌శంక‌ర్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే: భ‌య‌పెడుతూ న‌వ్వించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ఫ్రాంచైజీ క‌థ‌లు తెర‌కెక్కుతుంటాయి. ‘బాక్‌’ కూడా అదే త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆకారాన్ని మార్చుకుంటూ భ‌య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నించే ఓ దుష్ట శ‌క్తి త‌ప్ప... ఇందులో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. అస్సామీ జాన‌ప‌దాల నుంచి తీసుకొచ్చాం అని చిత్ర‌బృందం చెప్పినా బాక్ గ‌తంలో తెర‌పై క‌నిపించిన ఆత్మ‌ల్నే పోలి ఉంటుంది త‌ప్ప... దాని వెన‌క కొత్త క‌థ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ, హార‌ర్ ఎలిమెంట్స్ కానీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. ప్ర‌తీకారంతో కూడిన ఓ సాధార‌ణ హార‌ర్ కామెడీ చిత్ర‌మిది. అతీంద్రీయ శ‌క్తులు, సెంటిమెంట్ అంశాలు కీల‌కం. ఆత్మ‌గా మారిన శివాని చేసే హంగామా,  ప్ర‌థ‌మార్ధంలో వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, కోవై స‌ర‌ళ గ్యాంగ్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తాయి. శివ‌శంక‌ర్ త‌న సోద‌రి మ‌ర‌ణానికి కార‌ణాల్ని అన్వేషించే క్ర‌మ‌మే క‌థ‌ని ఆస‌క్తిక‌రంగా మారుస్తుంది.

శివానిది హ‌త్యా ఆత్మ‌హ‌త్యా అనే విషయాన్ని బ‌య‌ట‌పెట్టే స‌న్నివేశాలు, బాక్ అస‌లు నేప‌థ్యం వెలుగులోకి వ‌చ్చే ఎపిసోడ్  సినిమాని ఆస‌క్తిక‌రంగా మార్చేశాయి.  అయితే క‌థ సీరియ‌స్ మోడ్‌లోకి వెళ్లిన ప్ర‌తిసారీ, ఆ వెంట‌నే స్లాప్‌స్టిక్ కామెడీతో కూడిన స‌న్నివేశాలు రావ‌డంతో సినిమా పెద్ద‌గా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. కామెడీలోనైనా బ‌లం ఉందా అంటే అదీ లేదు. క‌థ, క‌థ‌నాల‌తో పెద్ద‌గా మెప్పించ‌ని ఈ సినిమా...  విజువ‌ల్స్ ప‌రంగా మాత్రం క‌ట్టి ప‌డేస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో చాలా స‌న్నివేశాలు విజువల్ హంగుల‌తో మెప్పిస్తాయి. బాక్‌, శివానీ త‌ల‌ప‌డిన‌ప్పుడు ఇద్ద‌రూ త‌మ శ‌క్తియుక్తుల్ని ప్ర‌ద‌ర్శించ‌డం, ఆ  నేప‌థ్యంలో వ‌చ్చే విజువ‌ల్ ఎఫెక్ట్స్‌... అలాగే ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ఆఖ‌రి పాట‌లో సిమ్ర‌న్‌, ఖుష్బూ క‌లిసి చేసిన సంద‌డి  కూడా మెప్పిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: క‌థానాయిక త‌మ‌న్నా త‌న పిల్ల‌ల్ని కాపాడుకునే ఓ త‌ల్లిగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శిస్తుంది. (baak movie review)  ఆమె పాత్ర‌లో సెంటిమెంట్ బాగా పండింది. ఆత్మగా క‌నిపిస్తూ చేసే హంగామా కూడా చిత్రానికి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. మాయ అనే ఓ వైద్యురాలిగా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది రాశీఖ‌న్నా.  సుంద‌ర్‌.సి న‌ట‌న మెప్పిస్తుంది. కోవై స‌ర‌ళ‌, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్ చేసే హంగామా అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. హిప్ హాప్ త‌మిళ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. కిచ్చా విజువ‌ల్స్ కూడా ఆక‌ట్టుకుంటాయి.  క‌థ‌, క‌థ‌నాలు  ఆస‌క్తిక‌రంగా లేక‌పోయినా, నిర్మాణ విలువ‌లు, విజువ‌ల్ గ్రాండ్‌నెస్ సినిమాని ప్ర‌త్యేకంగా మార్చేశాయి. ద‌ర్శ‌కుడు సుంద‌ర్.సి రచ‌న‌లో వైవిధ్యం లేదు.

  • బ‌లాలు
  • + విజువ‌ల్స్‌
  • + అక్క‌డ‌క్క‌డా భ‌య‌పెట్టే స‌న్నివేశాలు
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - వైవిధ్యం లేని క‌థ‌, క‌థ‌నాలు
  • - ప్ర‌భావం చూపించ‌ని హాస్యం
  • చివ‌రిగా: బాక్‌..  ఈ పేరే కొత్త‌ది.. క‌థ పాత‌దే! (baak movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని