kalki tickets: టికెట్ల రేట్ల వ్యవహారం.. వివరణ ఇచ్చిన నిర్మాత అశ్వనీదత్‌

టికెట్‌ రేట్ల వ్యవహారంలో అశ్వనీదత్‌ చేసిన వ్యాఖ్యలపై పలు రకాలు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు

Published : 06 Jul 2024 00:02 IST

హైదరాబాద్‌: ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో టికెట్‌ రేట్ల పెంపుదల గురించి వస్తున్న వార్తలపై సినీ నిర్మాత అశ్వనీదత్‌ (aswini dutt) స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

‘‘సినిమా టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రతీసారి ప్రభుత్వం చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఓ శాశ్వతమైన ప్రతిపాదన చేయాలన్నది ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) గారి అభిలాష. దీనిపై నిర్మాతలంతా కూర్చొని, కూలంకషంగా చర్చించమని సూచన చేశారు. సినిమా బడ్జెట్‌ను బట్టి టికెట్‌ రేట్లు ఎంత వరకూ పెంచుకోవచ్చో ఒక నిర్ణయానికి రమన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబునాయుడు గారితో (Chandra babu naidu) మాట్లాడతానని పవన్‌ హామీ ఇచ్చారు. అన్ని వర్గాలు, ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకొందామని పవన్‌ సూచించారు. ఆయన నిర్మాతలందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు’’ అని అశ్వనీదత్‌ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో టికెట్‌ రేట్లపై వచ్చిన అనవసర ఊహాగానాలకు తెరపడినట్లు అయింది.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం చిత్ర బృందం విజయాన్ని ఆస్వాదిస్తోందని, త్వరలోనే పార్ట్‌-2కు సంబంధించిన పనులు మొదలు పెడతామని నిర్మాత అశ్వనీదత్‌ ఇటీవల తెలిపారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి మూవీని తీసుకురానున్నట్లు తెలిపారు. తొలి భాగాన్ని మించేలా విజువల్స్‌ ఉంటాయని అన్నారు. పార్ట్‌-2లో కమల్‌, ప్రభాస్‌ నేపథ్యంలో సాగే డ్రామా సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని