Ashika Ranganath: రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తా..

‘‘తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నా సామిరంగ’. ఈ సంక్రాంతికి తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’

Updated : 10 Jan 2024 10:43 IST

‘‘తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నా సామిరంగ’. ఈ సంక్రాంతికి తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అంది ఆషిక రంగనాథ్‌. ‘అమిగోస్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొత్త అందం ఆషిక. ఇప్పుడామె నాగార్జునకు జోడీగా ‘నా సామిరంగ’లో సందడి చేసింది. విజయ్‌ బిన్ని తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది ఆషిక.

‘నా సామిరంగ’లో అవకాశం రావడం ఎలా అనిపించింది? దీంట్లో మీ పాత్ర ఎలా ఉండనుంది?

‘‘విజయ్‌ ఈ చిత్రం కోసం నన్ను సంప్రదించినప్పుడు ఆశ్చర్యపోయాను. నాలాంటి కొత్త నాయికకు నాగార్జున లాంటి పెద్ద స్టార్‌తో నటించే అవకాశం రావడం అదృష్టం. దీంట్లో నేను వరాలు అలియాస్‌ వరలక్ష్మీ అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు కథలో చాలా ప్రాధాన్యత ఉంది. నిజానికి గ్రామీణ నేపథ్య సినిమాల్లో నాయిక పాత్రలు సున్నితంగా ఉంటాయి. కానీ, వరాలు మాత్రం చాలా రెబల్‌. ఈ పాత్ర రెండు భిన్న కోణాల్లో కనిపిస్తుంది. ఈ సినిమా చూశాక అమ్మాయి అంటే ఇలా ఉండాలనే భావన కలిగించే పాత్రిది’’.

మీరు ఎక్కువగా ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

‘‘గ్లామర్‌తో పాటు నటనా ప్రాధాన్యమున్న చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. అలాగే పీరియాడిక్‌ సినిమా చేయాలనే కోరిక ఉంది. ఏదోక రోజు రాజమౌళి చిత్రంలో భాగం కావాలని బలంగా కోరుకుంటున్నా (నవ్వుతూ)’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘తెలుగులో కొత్త చిత్రాలేవీ ఒప్పుకోలేదు. తమిళంలో హీరో సిద్ధార్థ్‌తో ఓ సినిమా చేస్తున్నా. అలాగే కన్నడలో రెండు చిత్రాలు చేస్తున్నా’’.

ఈ సినిమాలో నాగార్జునతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఆయనతో పని చేయడం ఎలా అనిపించింది?

‘‘నాగార్జున రొమాంటిక్‌ హీరో. దీనికి తగ్గట్లుగానే సినిమాలో కథానుగుణంగా మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. అలాగే దీంట్లో అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ పాత్రలకు కూడా ప్రత్యేకమైన రొమాంటిక్‌ స్టోరీస్‌ ఉన్నాయి. ఆ పాత్రలన్నింటినీ చాలా అందంగా తీర్చిదిద్దారు. నాకు ఇందులో నరేశ్‌, రాజ్‌తరుణ్‌లతోనూ కాంబినేషన్‌ సీన్స్‌ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచిస్తాయి. ఇక నాగార్జునతో పని చేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన ఛార్మింగ్‌. అద్భుతమైన నటుడు. ఈ సినిమాలో కీరవాణి లాంటి పెద్ద సంగీత దర్శకుడు భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. విజయ్‌ ఈ సినిమాని అనుభవమున్న దర్శకుడిలా తీర్చిదిద్దారు’’.

కిష్టయ్యని ఎయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి!

‘నా సామిరంగ’ చిత్ర విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మంగళవారం ట్రైలర్‌ బయటకొదిలారు. ‘‘క్రిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు?’’ అంటూ అల్లరి నరేశ్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ట్రైలర్‌ రొమాంటిక్‌, యాక్షన్‌ అంశాల మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. క్రిష్టయ్యగా నాగ్‌ చూపించిన యాక్షన్‌ హంగామా.. అంజి, భాస్కర్‌ పాత్రల్లో నరేశ్‌, రాజ్‌తరుణ్‌ల అల్లరి.. వరాలుగా ఆషిక పాత్రను తీర్చిదిద్దిన తీరు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. మరి వీళ్ల నలుగురి పాత్రలకు ఉన్న లింకేంటి? కోనసీమ ప్రభల తీర్థంలో చెలరేగిన సంఘర్షణ ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘‘పాతికేళ్ల క్రితం ప్రభలెల్లకపోతే వరదలొచ్చాయని మా ఊళ్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈపాలి కిష్టయ్య వచ్చాడని మీ ఊళ్లో చెప్పుకుంటారు’’, ‘‘కిష్టయ్యని ఎయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని