Annapurna photo studio review: రివ్యూ: అన్న‌పూర్ణ ఫొటోస్టూడియో

Annapurna photo studio movie review: చైతన్య రావ్, లావణ్య కీలక పాత్రల్లో చెందు ముద్దు తెరకెక్కించిన ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ఎలా ఉంది?

Published : 21 Jul 2023 07:30 IST

Annapurna photo studio review; నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని తదితరులు; సంగీతం: ప్రిన్స్ హెన్రీ, ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ; కూర్పు: డి వెంకట్ ప్రభు; నిర్మాత: య‌ష్ రంగినేని; ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు; సంస్థ‌: బిగ్ బెన్ సినిమాస్; విడుద‌ల‌: 21-07-2023

పీరియాడిక్ క‌థ‌ల‌తో చిన్న సినిమాలు రూపొంద‌డం అరుదు. క‌థ‌కి త‌గిన ఆ వాతావ‌ర‌ణాన్ని పునః సృష్టించి చిత్రీక‌రించ‌డం ఆషామాషీ కాదు. కానీ నిజాయ‌తీగా ఓ మంచి క‌థ‌ని చెప్పాల‌ని ఆ ప్ర‌య‌త్నానికి పూనుకుంది ‘అన్న‌పూర్ణ ఫొటోస్టూడియో’ చిత్ర‌బృందం.  1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఆ నేప‌థ్యంలో సాగే  ఓ ప్రేమ‌క‌థ‌తోనే రూపొందిన చిత్ర‌మిది. ‘ఓ పిట్ట క‌థ‌’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చెందు ముద్దు రెండో ప్ర‌య‌త్నం ఇది. (Annapurna photo studio movie review) విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యాణం చేస్తున్న చైత‌న్య‌రావ్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ‘పెళ్లిచూపులు’, ‘డియ‌ర్ కామ్రేడ్’ చిత్రాల నిర్మాణంలో భాగ‌మైన  బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకంపై తెర‌కెక్కింది.  మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ప్రేక్షకులను అలరించేలా కథలో ఏముంది?

క‌థేంటంటే: 1980 ద‌శ‌కం అది. గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అంద‌మైన ప‌ల్లెటూరు. ఆ ఊళ్లో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి త‌ల్లి పేరు మీద అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. స్నేహితులంతా ఎగ‌తాళి చేస్తుంటారు. (Annapurna photo studio movie review) ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?  చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు?ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? ఇంత‌కీ చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: స్వ‌చ్ఛ‌మైన ఓ ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ ఇది. సాంకేతిక‌త లేని ఆ రోజులు ఎలా ఉండేవో... మ‌నుషుల్లోని అమాయ‌క‌త్వం ఎంత అందంగా ఉండేదో ఈ క‌థ‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. క‌ల్మ‌షం లేని పాత్ర‌లు, అంద‌మైన విజువ‌ల్స్‌.. విన‌సొంపైన సంగీతంతో 80ల కాలాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. కేవ‌లం ప్రేమ‌క‌థే కాదు.. ఇందులో ఓ మంచి థ్రిల్లింగ్ అంశం కూడా ఉంటుంది. (Annapurna photo studio movie review) క‌థానాయ‌కుడి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నంతో క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దొరికిన లేఖ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. పెళ్లి కాని ప్ర‌సాద్ అని స్నేహితులు ఏడిపించినా వాట‌న్నిటినీ స‌ర‌దాగా తీసుకుంటూ... ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా జీవితాన్ని స్వ‌చ్ఛంగా గ‌డిపే కుర్రాడు ఓ ద‌శ‌లో హ‌త్య‌లు చేయాల‌నే నిర్ణ‌యానికొస్తూ ఉంటాడు. అప్ప‌టిదాకా స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో హాయిగా సాగే క‌థ‌, హ‌త్య ప్ర‌స్తావ‌న వ‌చ్చేట‌ప్ప‌టికి ఓ కొత్త మ‌లుపుతో ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలా క‌థ‌ని న‌డుపుతూ వెళ్లిన ద‌ర్శ‌కుడు చివ‌ర్లో మ‌రికొన్ని మలుపులతో ప్రేక్ష‌కుల్లో ఓ మంచి అనుభూతిని పంచుతారు.

ద్వితీయార్ధంతో పోలిస్తే  ప్ర‌థ‌మార్ధంలో హాస్యం పాళ్లు ఎక్కువ‌. క‌థానాయ‌కుడి పెళ్లి క‌ష్టాలు, నాయిక‌తో ప్రేమాయ‌ణం, స్నేహితుల హంగామా బాగా న‌వ్విస్తాయి. సెకండాఫ్‌లో క్రైమ్ ఎలిమెంట్స్ ఉండ‌టంతో హాస్యం మోతాదు త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది.  (Annapurna photo studio movie review) సాంకేతిక‌త‌తో కలుషితం కాని పాత రోజుల్లోకి వెళ్లి ఆ వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించాల‌నుకునే ప్రేక్ష‌కుల్ని  ఈ సినిమా బాగా మెప్పిస్తుంది.  విన‌సొంపైన పాట‌లు, హాయిని పంచే లొకేష‌న్లు సినిమాకి మ‌రింత అందాన్ని తీసుకొచ్చాయి. అయితే 80ల నేప‌థ్యంలో మ‌లిచిన ఈ క‌థ‌ని, అప్ప‌టి సినిమాల్ని పోలిన‌ట్టుగానే స‌న్నివేశాల్ని మ‌ల‌చ‌డమే ఇబ్బంది పెడుతుంది. నాటి వాతావ‌ర‌ణాన్ని తెర‌పైన మ‌రోసారి పునః సృష్టించి చూపించ‌డంలో త‌ప్పు లేదు కానీ... అదే మెలోడ్రామాని ఇందులోకి తీసుకొచ్చారు. క‌థ‌, క‌థ‌నాలు సాగే విధానంలోనూ వేగం కొర‌వ‌డింది.

ఎవ‌రెలా చేశారంటే: చైత‌న్య‌రావ్  న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడిగా త‌న‌కి అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. ‘30 WEDS 21’ అనే సిరీస్‌లో ఆయ‌న ఇలా వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడి పాత్రే చేశారు. వింటేజ్ లుక్‌లో ఆయ‌న క‌నిపించిన తీరు,  గోదావ‌రి యాస, కామెడీలో టైమింగ్ ఆక‌ట్టుకుంటుంది. లావ‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిగా అందంగా క‌నిపించింది. ఆమె న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. (Annapurna photo studio movie review) చెల్లెలు ప‌ద్దు పాత్ర‌లో ఉత్త‌ర‌, స్నేహితుడిగా ల‌లిత్ ఆదిత్య‌, మ‌రో పాత్ర‌లో మిహిరా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ క‌నిపించే వైవా రాఘ‌వ పాత్ర కూడా బాగా న‌వ్విస్తుంది. నిర్మాత య‌ష్ రంగినేని క‌థ‌ని మ‌లుపు తిప్పే  ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. ప‌తాక స‌న్నివేశాల్లో ఆయ‌న పాత్ర‌, న‌ట‌న సినిమాకి కీల‌కం. కొత్త న‌టులతో దర్శ‌కుడు స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టుకున్నారు. ఆ కొత్త‌ద‌న‌మే సినిమాకి బ‌లం. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప‌ల్లెటూరి అందాల్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు శ‌భాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. క‌థ‌లో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. ద‌ర్శ‌కుడు చెందు ముద్దు తాను అనుకున్న క‌థ‌ని ప‌క్కాగా తెర‌పైకి తీసుకు రావ‌డంలో విజ‌యం సాధించారు.  మాటలతో అక్క‌డ‌క్క‌డా మెరిపించినా  క‌థ‌, క‌థ‌నాల ర‌చ‌నలో  ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.

  • బ‌లాలు
  • + 1980ల నేప‌థ్యం
  • + న‌టీన‌టులు
  • + క‌థ‌లో మ‌లుపులు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - పాత పంథాలో స‌న్నివేశాలు
  • చివ‌రిగా...: స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థ
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని