Gam Gam Ganesha ott: ఓటీటీలోకి వచ్చేసిన ‘గం.. గం.. గణేశా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఆనంద్‌ దేవరకొండ కీలక పాత్రలో నటించిన ‘గం.. గం.. గణేశా’ ఓటీటీలోకి వచ్చేసింది

Updated : 20 Jun 2024 14:24 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గం.. గం.. గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్లు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం క్రైమ్‌, కామెడీ థ్రిల్లర్‌గా అలరించింది. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. (gam gam ganesha ott release) ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆనంద్‌, ఇమ్మాన్యుయేల్‌, వెన్నెల కిషోర్‌ నటన కామెడీ టైమింగ్‌, ద్వితీయార్ధంలో ట్విస్ట్‌లు అలరించాయి.

కథేంటంటే: గణేశ్‌ (ఆనంద్‌ దేవరకొండ) అనాథ. స్నేహితుడి(ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి శ్రుతి (నయన్‌ సారిక) డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో ఎలాగైనా తానూ ధనవంతుడు కావాలనుకుంటాడు. దీంతో ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్‌ ఒప్పుకొని ఆ పని పూర్తి చేస్తాడు. అత్యాశకు పోయి ఆ వజ్రాన్ని తానే విక్రయించి డబ్బు సంపాదించాలనుకుంటాడు. వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో భయపడి అటుగా వెళ్తున్న భారీ వినాయకుడి విగ్రహం తొండంలో దాన్ని పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్‌రెడ్డి (రాజ్‌ అర్జున్‌) ఆర్డర్‌ మేరకు ఆ వినాయకుడి విగ్రహాన్ని ముంబయిలో ప్రత్యేకంగా తయారుచేయించి, ఊరికి తీసుకొస్తుంటాడు కిరాయి రౌడీ రుద్ర (కృష్ణ చైతన్య). అయితే, కిషోర్‌రెడ్డి ఊరికి వెళ్లాల్సిన ఆ విగ్రహం కాస్తా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది. ఇంతకీ ఆ విగ్రహంలో ఏముంది? కిషోర్‌రెడ్డి ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక కారణం ఏంటి? వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజ్రాన్ని గణేశ్‌ ఎలా తిరిగి సంపాదించాడు? అన్నది చిత్ర కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని