Allari Naresh: నీ బొమ్మ ఎన్ని జన్మలకైనా చెరగదులే!

‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్‌ చిలక నిర్మాత.

Updated : 06 Mar 2024 09:33 IST

‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఈ చిత్ర తొలి గీతాన్ని సంగీత దర్శకుడు తమన్‌ విడుదల చేశారు. ‘‘ఓయమ్మా కొంచెం ఆగవే.. మనసే చెప్పే మాటని పూర్తిగ వినరాదే.. నీ బొమ్మ మదిలో ఉన్నదే.. ఎన్ని జన్మల జన్మలకైనా చెరగదులే’’ అంటూ సాగుతున్న ఈ పాటకు గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. భాస్కరభట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: ఛోటా కె ప్రసాద్‌, ఛాయాగ్రహణం: సూర్య.


తెలంగాణ లగ్గం

సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా జంటగా రమేష్‌ చెప్పాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లగ్గం’. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. రాజేంద్ర ప్రసాద్‌, రోహిణి, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది వరకు తెలుగు సంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్‌తో చాలా చిత్రాలొచ్చాయి. ఇది వాటికి భిన్నంగా తెలంగాణదనం ఉట్టిపడే విధంగా ఉండనుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో తెలంగాణ పెళ్లిని కనులవిందుగా చూపించనున్నాం’’ అన్నారు దర్శకుడు రమేష్‌. నిర్మాత వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది కొన్నితరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుంద’’న్నారు. ఈ సినిమాకి సంగీతం: చరణ్‌ అర్జున్‌, ఛాయాగ్రహణం: బాల్‌ రెడ్డి.


ఆమెను హత్య చేసిందెవరు?

‘‘ప్రేమకథతో కూడిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. ఈ కథ చాలా కొత్తగా అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు సత్యరాజ్‌. ఆయన దర్శకత్వంలో రవితేజ నున్నా, నేహా జురెల్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల రామదాసు, నున్నా కుమారి సంయుక్తంగా నిర్మించారు. ఇది ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రవితేజ నున్నా మాట్లాడుతూ.. ‘‘ఇదొక రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. కథానాయికను ఎవరు హత్య చేశారనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కోసం రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను’’ అన్నారు. ‘‘నేను ఓసారి కేరళ నుంచి హైదరాబాద్‌ వస్తున్నప్పుడు ఎక్కడో జరిగిన కులాల పోట్లాట గురించి చుట్టూ ఉన్న వారు మాట్లాడుకోవడం విన్నాను. ఆ ఘటనతో ఒక ఊరే తగలబడిపోయినట్లు తెలిసింది. దాన్ని నేను అమలాపురం నేటివిటీకి తగ్గట్లుగా మార్చుకొని ఈ కథ సిద్ధం చేశాను. రెండు కుటుంబాల మధ్య జరిగే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రూపొందింది. దీంట్లో ఎక్కడా కులాల ప్రస్తావన ఉండదు. ఈ కథలో ఓ పెద్ద ట్విస్ట్‌ ఉంది. అది తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోతారు’’ అన్నారు దర్శకుడు సత్యరాజ్‌. ఈ చిత్రానికి రోషన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.


అసలు హంతకుడెవరు?

క క్లబ్‌లో జరిగిన హత్య.. ఏడుగురు అనుమానితులు. ఈ మిస్టరీని ఛేదించడానికి  ఏసీపీ భవానీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. సరదా సన్నివేశాలతో మొదలైన కథ.. ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని మలుపులకి గురవుతుంది. ఇంతకీ అసలు హంతకుడెవరన్న సస్పెన్స్‌ మాత్రం అలాగే కొనసాగింది. సారా అలీఖాన్‌, పంకజ్‌ త్రిపాఠి, విజయ్‌ వర్మ, కరిష్మా కపూర్‌, సంజయ్‌కపూర్‌, డింపుల్‌ కపాడియాలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ‘మర్డర్‌ ముబారక్‌’ ట్రైలర్‌ విశేషాలివి. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ని హోమీ అదజానియా తెరకెక్కిస్తున్నారు. దినేశ్‌ విజన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని