Alka Yagnik: సడెన్‌గా వినికిడి శక్తి కోల్పోయా.. టాప్‌ సింగర్‌ పోస్ట్‌ వైరల్‌

ప్రముఖ సింగర్‌ అల్కా యాగ్నిక్‌ (Alka Yagnik) అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇయర్ ఫోన్స్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్‌ పెట్టారు. 

Updated : 19 Jun 2024 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ (Alka Yagnik) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇయర్‌ ఫోన్స్‌ కారణంగా ఆమె చెవులకు వైరల్‌ అటాక్ అయినట్లు చెప్పారు. అభిమానుల ప్రార్థనలు కావాలని కోరుతూ ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. 

‘గత కొంతకాలంగా నేను కనిపించడం లేదని అందరూ మెసేజ్‌లు చేస్తున్నారు. వారందరి కోసం ఈ పోస్ట్‌ పెడుతున్నాను. కొన్ని వారాల క్రితం నేను విమానం దిగి వస్తుండగా సడెన్‌గా నాకేమీ వినిపించలేదు. దీంతో డాక్టర్‌ను సంప్రదిస్తే న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు చెప్పారు. వైరల్‌ ఎటాక్‌ కారణంగా ఇలా జరిగిందన్నారు. ఇది నా జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ. నాకు తెలియకుండానే దీని బారినపడ్డాను. దయచేసి నాకోసం మీరంతా ప్రార్థించండి. నా అభిమానులకు, సహచరులకు ఒక్కటే చెబుతున్నాను. పెద్ద సౌండ్‌తో మ్యూజిక్‌ వినడం, ఇయర్‌ ఫోన్స్‌ను ఉపయోగించడంలో జాగ్రత్త వహించండి. నా వృత్తిపరమైన జీవితం వల్ల కలిగిన తలెత్తిన అనారోగ్య సమస్యల గురించి భవిష్యత్తులో చెబుతాను. మీ మద్దతు, ప్రేమతో త్వరలోనే నేను కోలుకుంటానని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ సపోర్ట్‌ నాకెంతో అవసరం’ అని పేర్కొన్నారు. 

చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?

ఈ పోస్ట్‌కు టాప్‌ సింగర్స్‌, సంగీత దర్శకులు స్పందిస్తున్నారు. ‘డియర్‌ అల్కాజీ.. ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. అసలు ఊహించలేదు. ధైర్యంగా ఉండండి’ అని  శ్రేయా ఘోషల్‌ (Shreya Ghoshal) కామెంట్‌ పెట్టారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఏఆర్‌ రెహమాన్‌ (A. R. Rahman), సోనూనిగమ్‌, శంకర్‌ మహదేవన్‌ (Shankar Mahadevan)లు రిప్లై పెట్టారు.

1966లో జన్మించిన అల్కా యాగ్నిక్‌.. ఆరేళ్ల వయసు నుంచే పాడడం ప్రారంభించారు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ సాంగ్స్‌ పాడారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 25 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడారు. ఏడుసార్లు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ఆమె ప్రతిభకు రెండు జాతీయ అవార్డులు వరించాయి. బాలీవుడ్‌లో మహిళా విభాగంలో అత్యధిక సోలో సాంగ్స్ పాడిన జాబితాలో లతా మంగేష్కర్‌, ఆశా భోస్లే తర్వాత అల్కా యాగ్నిక్‌ మూడో స్థానంలో నిలిచారు. 2002లో వచ్చిన ‘మనసుతో’ సినిమాలో  ‘చిన్ని మనసే గాలిపటమై’ పాటతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోనూ కొన్ని పాటలు పాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని