Thegimpu Review: రివ్యూ: తెగింపు

అజిత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తెగింపు’ (Thegimpu Review) చిత్రం ఎలా ఉందంటే...

Updated : 11 Jan 2023 13:33 IST

Thegimpu Review చిత్రం: తెగింపు; న‌టీన‌టులు: అజిత్‌, మంజు వారియ‌ర్‌, స‌ముద్రఖ‌ని, పావ‌ని రెడ్డి, జాన్ కొక్కెన్‌, వీర‌, భ‌గ‌వతీ పెరుమాల్‌, జి.ఎం.సుంద‌ర్, త‌దిత‌రులు; సంగీతం: జిబ్రాన్‌; ఛాయాగ్రహ‌ణం: నీర‌వ్ షా; కూర్పు: విజ‌య్ వేలుకుట్టి; నిర్మాణం: బోనీక‌పూర్; సంస్థ‌: బే వ్యూ ప్రాజెక్ట్స్‌, జీ స్టూడియోస్; ద‌ర్శక‌త్వం: హెచ్‌. వినోద్‌; విడుద‌ల‌: 11-1-2023

అజిత్(Ajith) ‘తెగింపు’తో తెలుగునాట సంక్రాంతి సంద‌డి షురూ అయ్యింది. ఇక నుంచి నాలుగు రోజుల‌పాటు  వ‌రుస‌గా కొత్త సినిమాల సంద‌డే. పండ‌గ సీజ‌న్ కావ‌డం, అజిత్‌(Ajith)కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండ‌టంతో ఈ చిత్రం ఇక్కడ కూడా ఘ‌నంగా విడుద‌లైంది. అజిత్(Ajith) - హెచ్‌.వినోద్ కాంబినేషన్‌లో  వచ్చిన మూడో చిత్రమిది. ప్రచార చిత్రాలు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం(Thegimpu Review).

క‌థేంటంటే: పోలీస్ అధికారితో క‌లిసి ఓ ముఠా విశాఖ‌లోని యువ‌ర్ బ్యాంక్‌లో రూ.500 కోట్ల దోపిడీకి వ్యూహం ర‌చిస్తుంది. పక్కా ప్రణాళిక‌తో బ్యాంక్‌లోకి చొర‌బ‌డిన ముఠా వ్యూహాన్ని చిత్తు చేస్తూ అక్కడ డార్క్ డెవిల్ (అజిత్‌)(Ajith) ప్రత్యక్షం అవుతాడు. ఆ ముఠానే హైజాక్ చేసిన మ‌రో దోపిడీ ముఠాగా డార్క్ డెవిల్ బృందం బ్యాంక్‌లోనే న‌క్కుతుంది. నిజాయ‌తీ ప‌రుడైన పోలీస్ క‌మిష‌న‌ర్ (స‌ముద్రఖ‌ని)(Samuthirakani) రంగంలోకి దిగుతాడు. మ‌రి డార్క్ డెవిల్ బ్యాంక్ దోపిడీ కోస‌మే వ‌చ్చాడా? బ్యాంక్‌లో ఉన్నది రూ. 500 కోట్లే అన్న లెక్క‌.. ఆ త‌ర్వాత ఎలా మారింది? ఇంత‌కీ ఈ డార్క్ డెవిల్ ఎవ‌రు? అత‌డి ల‌క్ష్యం ఏమిట‌నేది మిగ‌తా క‌థ‌(Thegimpu Review).

ఎలా ఉందంటే: ప్రజల బ‌ల‌హీన‌త‌ల్ని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవ‌స్థ గురించి చ‌ర్చించే చిత్రమిది. సామాన్యుడు నిత్యం ఎలా మోస‌పోతున్నాడో, వ్యవ‌స్థలు ఎలా ప‌నిచేస్తున్నాయో ఆలోచ‌న రేకెత్తించేలా చెప్పాడు ద‌ర్శకుడు. అదొక్కటే కాదు, మీడియాతోపాటు రాజ‌కీయ రంగాల‌పై కూడా  కొన్ని అస్త్రాలను సంధించాడు. స్టాక్ మార్కెట్ల కుంభకోణాల్ని ప‌రిచ‌యం చేస్తూ మొద‌ల‌వుతుందీ చిత్రం. ముఠాలు దోపిడీ కోసం బ్యాంక్‌లోకి అడుగు పెట్టిన‌ప్పట్నుంచి క‌థంతా ఆ నేప‌థ్యంలోనే  సాగుతుంది.  అజిత్(Ajith) మార్క్ యాక్షన్‌, ఫ్యాన్స్‌ని అల‌రించే అంశాల్ని పుష్కలంగా ద‌ట్టించారు. ప్రథ‌మార్ధంలో ముఠాల ఎత్తులు, పై ఎత్తులతో క‌థ గురించి కూడా పెద్దగా ఆలోచించే అవ‌కాశం ఇవ్వలేదు.

బ్యాంక్ దోపిడీ కోస‌మే వ‌చ్చిన‌ట్టుగా క‌నిపించే క‌థానాయ‌కుడి ముఠా అస‌లు ల‌క్ష్యం ఏమిటి? డార్క్ డెవిల్ ఎవ‌ర‌నే అంశాల్ని అలాగే దాచిపెడుతూ ద్వితీయార్ధం మొద‌లుపెట్టాడు ద‌ర్శకుడు. కానీ క‌థానాయ‌కుడి ఫ్లాష్ బ్యాక్ ఏ మాత్రం అర్థం కాదు. కాల్పుల మోత త‌ప్ప అందులో ఏమీ లేదు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌తోనే ముడిపెడుతూ బ్యాంకింగ్ వ్యవ‌స్థలో మోసాల‌కి సంబంధించిన అంశాన్ని చెప్పిన తీరు మాత్రం ఆక‌ట్టుకుంటుంది. అజిత్ ఇదివ‌ర‌కు చేసిన కొన్ని సినిమాల‌కి ద‌గ్గర‌గా ఉన్నప్పటికీ, ఆయ‌న పాత్రని మ‌లిచిన విధానం మాత్రం ప్రత్యేకం. చెప్పాల‌నుకున్న విష‌యాలను క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ముడిపెడుతూ బ‌లంగా చెప్పినా, క‌థ‌నం ప‌రంగా మాత్రం పెద్దగా ప్రభావం చూపించ‌లేక‌పోయారు ద‌ర్శకుడు. 

ఎవ‌రెలా చేశారంటే: క‌థానాయ‌కుడు అజిత్(Ajith) వ‌న్ మ్యాన్‌ షోలా ఉంటుందీ చిత్రం. ఆయ‌న‌కి అల‌వాటైన పాత్రలో అంతే సుల‌భంగా ఒదిగిపోయారు. త‌న హుషారుతో అభిమానుల్లో జోష్‌ని నింపుతారు. ర‌మ‌ణి పాత్రలో మంజు వారియ‌ర్(Manju Warrier) న‌టించారు. క‌థ‌లో ఆమెదీ కీల‌క‌మైన పాత్రే. యాక్షన్ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. స‌ముద్రఖ‌ని, జాన్ కొక్కేన్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జిబ్రాన్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. కూర్పు, కెమెరా విభాగం చ‌క్కటి ప‌నితీరుని క‌న‌బ‌రిస్తుంది. తెలుగు అనువాదం ప‌రంగా స‌రైన జాగ్రత్తలు తీసుకోలేదు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ద‌ర్శకుడు వినోద్ క‌థ‌, క‌థ‌నాల కంటే కూడా అజిత్ హీరోయిజంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు.

బ‌లాలు
1.అజిత్ పాత్ర‌, న‌ట‌న, 2.యాక్షన్ ఘ‌ట్టాలు. 3.నేటి వ్యవ‌స్థలను ఆవిష్కరించిన క‌థ‌

బ‌ల‌హీన‌త‌లు
1.క‌థ‌నం, 2.ఆస‌క్తిని రేకెత్తించే అంశాలు లేక‌పోవ‌డం, 3.ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా: తెగింపు.. అజిత్ షో

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని