Raveena Tandon: ‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్‌ విజ్ఞప్తి.. వీడియో వైరల్‌

తమపై దాడి చేయొద్దంటూ రవీనా టాండన్‌ విజ్ఞప్తి చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 02 Jun 2024 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘మాపై దాడి చేయకండి’ అంటూ ఆమె విజ్ఞప్తి చేయడం అందులో కనిపించింది. బాంద్రా (ముంబయి) కార్టర్‌ రోడ్డులో వెళ్తున్న ముగ్గురిని.. అదే మార్గంలో ప్రయాణిస్తున్న రవీనా కారు ఢీ కొట్టిందని ప్రచారం జరగడంతో బాధితుల కుటుంబ సభ్యులు, అదే మార్గంలో ప్రయాణిస్తున్న కొందరు ప్రశ్నించగా రవీనా డ్రైవర్‌ వారిపై దాడికి దిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రవీనా కారు దిగి వచ్చి బాధితులపైనే మండిపడ్డారు. దీంతో అక్కడున్న వారు ఎదురు తిరగ్గా ఆమె దాడి చేయొద్దంటూ కోరారని ఆంగ్ల వెబ్‌సైట్స్‌ రాసుకొచ్చాయి. ఈ ఘటనను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరిస్తుంటే రికార్డు చేయొద్దని రవీనా కోరుతున్నట్టు అదే వీడియోలో కనిపించింది. రవీనా అనుచితంగా ప్రవర్తించారంటూ ఓ బాధితురాలి కుమారుడు ఆరోపించారు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అయితే, ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చింది. రవీనా ప్రయాణిస్తున్న కారు ఎవరినీ తాకలేదు. కారు రివర్స్‌ చేస్తుండగా, ఆ పక్క నుంచి వెళ్లిన మహిళ రవీనా డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపించింది. కారు ఇంటి గేటు నుంచి కాస్త లోపలికి వెళ్లిన తర్వాత అక్కడున్న మహిళల గుంపు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. డ్రైవర్‌, అక్కడున్న వాచ్‌మెన్‌ వారిని నిలువరించేందుకు ప్రయత్నించడం సీసీ టీవీలో స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో కారు నుంచి కిందకు దిగిన రవీనా గొడవకు దిగిన మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై రవీనా స్పందించలేదు. ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని