Pradeep K Vijayan: ‘మహారాజ’ నటుడి అనుమానాస్పద మృతి.. ఇంట్లోనే విగతజీవిగా..

Pradeep K Vijayan: విజయ్‌ సేతుపతి ‘మహారాజ’ సినిమాలో నటించిన తమిళ నటుడు ప్రదీప్‌ కె.విజయన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Published : 13 Jun 2024 17:21 IST

చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కోలీవుడ్‌లో యువ నటుడు ప్రదీప్‌ కె.విజయన్‌ (Pradeep K Vijayan) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చెన్నైలోని తన ఇంట్లోనే విగతజీవిగా కన్పించాడు. రెండు రోజుల క్రితమే అతడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. (Tamil Actor Found Dead)

ప్రదీప్‌కు ఇంకా పెళ్లి కాలేదు. చెన్నైలోని పాలవాక్కమ్‌లో గల ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. గత రెండు రోజులుగా స్నేహితులు అతడికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఓ మిత్రుడు బుధవారం నటుడి ఇంటికివెళ్లి చూడగా లోపలినుంచి తాళం వేసి కన్పించింది. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయకపోవడంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు.

పోలీసులు అక్కడికి చేరుకుని తలుపు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లగా బాత్రూమ్‌లో ప్రదీప్‌ (Pradeep K Vijayan) విగతజీవిగా కన్పించాడు. తలకు బలమైన గాయం తగలడం లేదా గుండెపోటుకు గురై అతడు మృతిచెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం నటుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం ప్రదీప్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడని అతడి స్నేహితుడు పోలీసులకు చెప్పారు. నటుడి మృతిపై  సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

తమిళ పరిశ్రమలో ‘పప్పు’గా సుపరిచితుడైన ప్రదీప్‌ 2013లో సినిమాల్లోకి వచ్చాడు. ‘తెగిడి’ సినిమాతో పాపులర్ అయ్యాడు. ‘టెడ్డీ’, ‘హే సినామిక’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. చివరిసారిగా రాఘవ లారెన్స్‌ నటించిన ‘రుద్రన్‌’ సినిమాలో కన్పించాడు. విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజ’ చిత్రంలోనూ ప్రదీప్‌ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ చేశాడు. ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని