Murali Mohan: ఎన్టీఆర్‌ పురస్కారం ఓ ప్రత్యేక గౌరవం: మురళీమోహన్‌

ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన  పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్‌. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు.

Updated : 01 Jul 2024 05:38 IST

న్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన  పురస్కారాన్ని అందుకోవడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ప్రముఖ నటుడు మురళీమోహన్‌. ‘అన్నదమ్ముల అనుబంధం’లో కలిసి నటించాక ఆయన కుటుంబంలో నేనూ ఓ భాగమైపోయానన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కళా వేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక జరిగింది. ఇందులో మురళీమోహన్‌ను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి మోహనకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ సంచలనాలకు మారు పేరు. చిత్రరంగంలో, రాజకీయ రంగంలో ఆయన సాధించినవి ఎన్నెన్నో. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం నా అదృష్టం. నాన్న పేరుతో పురస్కారాల్ని ఏర్పాటు చేసి, ఇంత ఘనంగా వేడుకని జరిపిన కళావేదిక, రాఘవి మీడియా సంస్థలకు నా అభినందనలు’’ అన్నారు.

మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘‘హిందీలో విజయవంతమైన ‘యాదోంకీ బారాత్‌’ తెలుగు రీమేక్‌ కోసమని నన్ను నిర్మాతలు ఎన్టీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడే ఆయన్ని తొలిసారి కలుసుకోవడం. ‘అన్నదమ్ముల అనుబంధం’ పేరుతో రూపొందిన ఆ సినిమాతోనే నాకు పేరొచ్చింది. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు నన్ను ఎన్టీఆర్‌ తమ్ముడుగానే గుర్తించేవారు. ఆయన రాజకీయ రంగంలోకి వచ్చాక కూడా ఎన్నో బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరుపైనే ఉంది. ఆయన పేరుపై పురస్కారం ఓ ప్రత్యేకమైన గౌరవం’’ అన్నారు. ఆనంద్‌ దేవరకొండ, సాయిరాజేశ్, సాహు గారపాటి, అజయ్, శ్రీకాంత్‌ ఓదెల, తిరువీర్‌ తదితర సినీ ప్రముఖులు పురస్కారాల్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ మనవరాలు నందమూరి మోహనరూప, టి.ప్రసన్నకుమార్, మాదాల రవి, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, అట్లూరి నారాయణరావు, వల్లభనేని అనిల్, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని