Dev Gill: రాజమౌళి వల్లే నాకు పేరొచ్చింది: నటుడు దేవ్‌గిల్‌

దర్శకుడు రాజమౌళి వల్లే నటుడిగా తనకు మంచి పేరొచ్చిందని అన్నారు నటుడు దేవ్‌గిల్‌. ఈయన ‘మగధీర’లో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Published : 21 Jun 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు రాజమౌళి (Rajamouli) వల్లే తనకు మంచి పేరొచ్చిందని నటుడు దేవ్‌గిల్‌ (Dev Gill) అన్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ‘అహో! విక్రమార్క’ (Aho Vikramaarka) టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు.

‘‘తల్లీదండ్రులు పుణెలో నాకు జన్మనిస్తే.. రాజమౌళి సర్‌ నాకు నటుడిగా పేరొచ్చేలా చేశారు. 15 ఏళ్ల క్రితమే ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇటీవల నేను ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పా. రాజమౌళి టీమ్‌ సహాయంతోనే పుణెలో ‘అహో! విక్రమార్క’ సినిమాని నిర్మించగలిగా. విలన్‌గా మీరంతా (తెలుగు ప్రేక్షకులు) నన్ను ఆదరించారు. ఈ కొత్త చిత్రంతో మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నా. డ్యాన్స్‌, ఫైట్స్‌తో వినోదం పంచుతా’’ అని అన్నారు.

రామ్‌ చరణ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘చరణ్‌ నా హీరో. కథానాయకుడు ఎలా అవ్వాలో ఆయనే చెప్పారు. తను నాకు స్ఫూర్తి’’ అని తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో మళ్లీ ఎప్పుడు నటిస్తారనే ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ అవకాశం వస్తే తప్పక నటిస్తానని అన్నారు. తాను హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘అహో! విక్రమార్క’ను రాజమౌళి కో- డైరెక్టర్‌ పేట త్రికోటి తెరకెక్కిస్తుండడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మగధీర’, ‘రగడ’, ‘నాయక్‌’, ‘రచ్చ’ తదితర చిత్రాల్లో విలన్‌గా నటించారు దేవ్‌గిల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని