Ajay Ghosh: ‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్‌ ఘోష్‌

‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు అజయ్‌ ఘోష్‌. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘పుష్ప’ సినిమాపైనా స్పందించారు.

Published : 02 Jun 2024 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తన జీవితాన్ని మార్చారని నటుడు అజయ్‌ ఘోష్‌ (Ajay Ghosh) తెలిపారు. ఒకానొక దశలో తన కెరీర్‌ అయిపోయిందనుకున్నానని, అప్పుడు సుకుమార్‌ (Sukumar) ఇచ్చిన అవకాశంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు. తాను ప్రధాన పాత్ర పోషించిన ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop Murthy) ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘అందరికీ సుకుమార్‌ ఓ దర్శకుడు. నా దృష్టిలో ఆయన డైరెక్టర్‌ కాదు.. నేనేంటో నాకు తెలిసేలా చేసిన గురువు. కొవిడ్‌ బారిన పడ్డాక  కెరీర్‌ ముగిసిపోయిందని అనుకున్నా. ‘పుష్ప’ (Pushpa)లో నటించేందుకు సుకుమార్‌ అడగ్గా నా వల్ల కాదని చెప్పా. అయినా వదలకుండా నాతో అరగంట మాట్లాడారు. ఆ మోటివేషన్‌తో వెంటనే చిత్రీకరణకు హాజరయ్యా’’ అని పేర్కొన్నారు.

ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్‌ శంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పుష్ప 2’ (Pushpa 2)లో మీ క్యారెక్టర్‌ లేకపోవడం బాధగా ఉందా? అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘‘నాకు ఎలాంటి బాధ లేదు. ‘పుష్ప 2’ గురించి ఎవరైనా ప్రస్తావించాల్సి వస్తే కచ్చితంగా ‘పుష్ప’ గురించి మాట్లాడాల్సిందే. పార్ట్‌1 గురించి చర్చిస్తే కొండారెడ్డి (ఆయన పోషించిన పాత్ర పేరు) ఉండాల్సిందే. నా కోసం మరో చిత్రంలో అద్భుతమైన పాత్ర సృష్టిస్తారు సుకుమార్‌’’ అని అన్నారు. రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలిపారు. ఇరవయ్యేళ్ల వయసులో కన్న కలలు, లక్ష్యాల కోసం యాభయ్యేళ్ల మూర్తి చేసిన ప్రయాణం ఎలా సాగింది? అన్న కథాంశంతో ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ సినిమా రూపొందింది. హీరోయిన్‌ చాందినీ చౌదరి కీలక పాత్ర పోషించారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని