7G Brudavan Colony: ‘7/జీ బృందావన కాలని’ చిత్రాన్ని ఒక్కసారి మాత్రమే చూశా.. ఎందుకంటే: రవికృష్ణ

రవికృష్ణ - సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘7/జీ బృందావన కాలనీ’. త్వరలో ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది.

Published : 17 Sep 2023 11:41 IST

హైదరాబాద్‌: ‘7/జీ బృందావన కాలని’ (7G Brindavan Colony)తో ప్రేక్షకులకు చేరువయ్యారు నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు నటుడు రవికృష్ణ (Ravi Krishna). 2004లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. సోనియా అగర్వాల్‌ కథానాయిక. సెల్వ రాఘవన్‌ దర్శకుడు. సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 22న 4కే వెర్షన్‌లో ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం సందడి చేసింది.

‘‘రీ రిలీజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. కన్నీళ్లు వస్తున్నాయి. సినిమాలోని హీరో పాత్రకు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని ఒక్కసారి మాత్రమే పూర్తిగా చూశా. ఎందుకంటే, క్లైమాక్స్‌ చూడటం నావల్ల కాదు. ఒకవేళ సినిమా చూస్తే నేను ఆ పాత్రలోకి వెళ్లిపోతా. షూటింగ్‌ చేస్తున్నప్పుడు కూడా.. ఓ రోజు ఇంట్లో నిరాశగా ఏదో ఆలోచిస్తూ కూర్చొన్నా. నన్ను అలా చూసి మా అమ్మ షాకయ్యారు. ఇక, ఇప్పుడు ఇదే చిత్రానికి కొనసాగింపుగా పార్ట్‌ 2 తీస్తున్నాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ కథ ఉండనుంది. విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నా’’ అని రవికృష్ణ చెప్పారు.

‘సైమా’లో ‘విక్రమ్‌’ హవా.. రెండు అవార్డులు అందుకున్న కమల్‌హాసన్‌

అనంతరం నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ‘‘కర్తవ్యం’, ‘భారతీయుడు’ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించి ఇండస్ట్రీలో మంచి పేరు సొంతం చేసుకున్నా. నేను నిర్మించిన చిత్రాల్లో ‘7జీ బృందావన కాలని’ ఒక కల్ట్‌ మూవీ. ఈ చిత్రాన్ని మరోసారి తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా. వచ్చే నెల నుంచి పార్ట్‌ 2 పనులు మొదలు కానున్నాయి. ‘7జీ బృందావన కాలని’ని తెరకెక్కించిన సెల్వరాఘవన్‌ సీక్వెల్‌ను రూపొందించనున్నారు. స్క్రిప్ట్‌ సిద్ధమైంది. తప్పకుండా అందరూ కనెక్ట్‌ అవుతారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని