Telugu Movies in July: జులైలో అలరించనున్న చిత్రాలివే.. సీక్వెల్‌తో కమల్‌.. యాక్షన్‌తో ధనుష్‌

జులైలో విడుదల కానున్న సినిమాల వివరాలివి. ఏ వారంలో ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందంటే?

Published : 01 Jul 2024 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. వాటిలో చాలా సినిమాలు ప్రస్తుతం ఓటీటీల వేదికగా ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి. మరి, జులైలో థియేటర్‌/ఓటీటీలో విడుదల కానున్న సినిమాలేంటి? ఏ రోజు ఏ సినిమా రానుంది? స్టార్‌ హీరోల మూవీస్‌ ఏమైనా ఉన్నాయా? చూసేద్దాం..

తొలివారం ఒక్కటే..

గత నెల 27న విడుదలైన ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రూ. 555 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఆ హవాను దృష్టిలో పెట్టుకుని ఈవారం తమ చిత్రాలను విడుదల చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఒకే ఒక్క చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘14’. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో నోయల్‌ (Noel Sean), విశాఖ ధిమన్‌ (Vishakha Dhiman) జంటగా నటించారు. లక్ష్మీ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు.

సేనాపతి మళ్లీ వస్తున్నాడు..

‘భారతీయుడు’ (1996)లో సేనాపతి పాత్ర పోషించి, విశేషంగా ఆకట్టుకున్నారు నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan). ఇన్నేళ్ల తర్వాత మరోసారి అదే క్యారెక్టర్‌తో అలరించనున్నారు. ఆ సినిమా సీక్వెల్‌ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)లో అదే ఓల్డ్‌ గెటప్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో వినోదం పంచనున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాభవానీ శంకర్‌ కీలక పాత్రలు పోషించారు. అధునాతన సాంకేతిక సాయంతో దివంగత నటులు నెడుముడి వేణు, వివేక్‌లను తెరపై చూపించనున్నారు దర్శకుడు శంకర్‌. ఈ క్రేజీ ప్రాజెక్టు తెలుగులోనూ ఈ నెల 12న (Indian 2 Release Date) రిలీజ్‌ కానుంది.

మరో డార్లింగ్‌..

అందరినీ డార్లింగ్‌ (Darling) అని పిలవడమే కాకుండా అదే పేరుతో రూపొందిన సినిమాలో నటించి, విజయం అందుకున్నారు ప్రభాస్‌ (Prabhas). అదే టైటిల్‌తో మరో చిత్రం రాబోతోంది. ఈసారి ‘డార్లింగ్‌’ అనేది మరెవరో కాదు ప్రియదర్శి (Priyadarshi Pulikonda), నభా నటేశ్‌ (Nabha Natesh). ఈ ఇద్దరు జంటగా నటించిన ఆ చిత్రానికి అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ జులై 19న రానుంది.

ఇటు అల్లు శిరీష్‌.. అటు ధనుష్

అల్లు శిరీష్‌ (Allu Sirish) ప్రధాన పాత్రలో శ్యామ్‌ ఆంటోన్‌ రూపొందించిన చిత్రం ‘బడ్డీ’ (Buddy). గాయత్రి భరద్వాజ్ (Gayatri Bhardwaj), ప్రిషా రాజేశ్‌ సింగ్‌ (Prisha Rajesh Singh) హీరోయిన్లు. టెడ్డీబేర్‌కూ ఇందులో ప్రాధాన్యముంది. అన్యాయంపై పోరాడిన ఆ టెడ్డీబేర్‌ కథేంటి? దాంతో హీరోకున్న సంబంధమేంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్వీయ దర్శకత్వంలో ధనుష్‌ (Dhanush) హీరోగా నటించిన చిత్రం ‘రాయన్‌’ (Raayan). ఆయనకు ఇది 50వ సినిమా. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సందీప్‌ కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌, అపర్ణా బాలమురళి కీలక పాత్రలు పోషించారు. ఈ రెండు చిత్రాలు ఈ నెల 26న రిలీజ్‌ కానున్నాయి.

హిందీ చిత్రాల వివరాలివీ..

అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), టబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు నీరజ్‌ పాండే రూపొందించిన చిత్రం ‘ఔరో మే కహా దమ్‌ థా’ (Auron Mein Kahan Dum Tha). ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ మూవీ ఈ నెల 5న విడుదల కానుంది. అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్ఫిరా’ (Sarfira). సుధా కొంగర దర్శకురాలు. మంచి విజయాన్ని అందుకున్న ‘సూరారై పోట్రు’ (ఆకాశమే నీ హద్దురా) చిత్రానికి రీమేక్‌. ఈ నెల 12న రిలీజ్‌ కానుంది. సోనాక్షీ సిన్హా (Sonakshi Sinha), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన సినిమా ‘కాకుడా’ (Kakuda). ఈ హారర్‌ కామెడీ మూవీకి ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. నేరుగా ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో ఈ నెల 12న విడుదలవుతుంది. విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), త్రిప్తి డిమ్రి (Triptii Dimri) ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ చిత్రం ‘బ్యాడ్‌ న్యూజ్‌’ (Bad Newz). ఆనంద్‌ తివారీ దర్శకుడు. సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని