Zika Alert: ‘జికా’ వైరస్‌ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ

మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది.

Published : 03 Jul 2024 19:29 IST

దిల్లీ: మహారాష్ట్రలో పలుచోట్ల జికా వైరస్‌ కేసులు వెలుగు చూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే ఏడు కేసులు నిర్ధరణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై నిఘా పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా గర్భిణీలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం, ఒకవేళ పాజిటివ్‌ వచ్చినట్లయితే పిండం ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

  • డెంగీ, చికెన్‌ గున్యా మాదిరిగానే దోమల ద్వారా జికా వైరస్‌ సంక్రమిస్తుంది. ఎడిస్‌ దోమలు కుట్టడం ద్వారా ఇది సోకుతుంది.
  • ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇన్‌ఫెక్షన్‌ సోకిన మహిళకు పుట్టబోయే పిల్లలు తల చిన్నగా ఉండడం (Microcephaly)తోపాటు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
  • అయితే, 2016 నుంచి ఇటువంటి కేసు ఒక్కటి కూడా దేశంలో వెలుగు చూడలేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
  • జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • జికా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఉండే గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.
  • నివాస ప్రాంతాలు, పని ప్రదేశాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టాలని అడ్వైజరీలో సూచించింది.
  • జైకా వైరస్‌పై ప్రజలు ఆందోళనకు గురికాకుండా వైరస్‌ వ్యాప్తి, లక్షణాలు, జాగ్రత్తలపై సోషల్‌ మీడియాతోపాటు ఇతర మార్గాల్లో అవగాహన కల్పించాలని కోరింది.
  • ఎడిస్‌ దోమల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి, నోడల్‌ ఆఫీసర్‌ సాయంతో అక్కడ పర్యవేక్షణ, నివారణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ సూచించారు.
  • ఈ వైరస్‌ కేసులు వెలుగుచూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో అవసరమైన చర్యలతో రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని తెలిపింది.
  • ఒకవేళ ఏదైనా కేసు గుర్తించిన వెంటనే సమగ్ర వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం (ఐడీఎస్‌పీ)తోపాటు ఎన్‌సీవీబీడీసీకి తెలియజేయాలని సూచించింది. పుణెలోని ఎన్‌ఐవీ, దిల్లీలోని ఎన్‌సీడీసీ కేంద్రాల్లో జికా నిర్ధరణ సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది.
  • ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాల్లోనూ ఈ వ్యాధి ప్రబలింది. మొత్తంగా 2016 నాటికి 39 దేశాల్లో వ్యాధి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని