Criminal Laws: జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు.. జులై 1 నుంచే కొత్త చట్టాలు!

కొత్తగా రూపొందించి నేర న్యాయ చట్టాల ప్రకారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది.

Published : 26 Jun 2024 18:58 IST

దిల్లీ: బ్రిటిష్‌ వలస పాలన నాటి చట్టాల స్థానంలో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నేర న్యాయ చట్టాలు (New Criminal Laws) జులై 1నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR), ఆన్‌లైన్‌లోనే పోలీసు ఫిర్యాదు (Online police complaints), ఎలక్ట్రానిక్‌ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక అంశాలు ఇందులో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది. తద్వారా తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు పోలీసుల స్పందనను సులభతరం చేస్తుంది.

  • ఏదైనా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఏ పోలీస్‌ స్టేషన్‌కైనా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు.
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా పోలీసుస్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్‌ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.
  • బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ఉచితంగా పొందే వీలుంది. వీటితోపాటు పోలీస్‌ రిపోర్టు, ఛార్జిషీట్‌, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు.
  • అరెస్టు సందర్భాల్లో బాధితుడు తమ సన్నిహితులు, బంధువులకు ఆ పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా తక్షణ సహాయం పొందేందుకు వీలు కలుగుతుంది.
  • అరెస్టుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌తోపాటు జిల్లా హెడ్‌ క్వార్టర్లలోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టు సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.
  • కేసు, దర్యాప్తును పటిష్ఠంగా నిర్వహించేందుకు గాను తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్‌ నిపుణులు తప్పనిసరిగా ఘటనా స్థలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. దీంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకు నేరం జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించే క్రమాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించాలి.
  • చిన్నారులు, మహిళలపై జరిగే నేరాల్లో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ఈ కొత్త చట్టాలు చెబుతున్నాయి.
  • పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. ఆపద సమయంలో వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు త్వరగా కోలుకోవాలనేది ఉద్దేశం.
  • ఆన్‌లైన్‌లోనే సమన్లు జారీ చేయడం.. తద్వారా పేపర్‌ వర్క్‌ను తగ్గించి, అన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సమాచారం అందించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.
  • మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మహిళా మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళాసిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి.
  • కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.
  • సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల పరిరక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
  • అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
  • మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నివాసమున్న చోటే పోలీసుల సాయం పొందవచ్చు.
  • స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజసేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి. తమ తప్పిదాలను తెలుసుకోవడంతోపాటు సామాజిక బాధ్యతను పెంపొందించేలా వీటిని రూపొందించారు.
  • న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు వేగంగా కేసుల పరిష్కారం అందించే ఉద్దేశంతో బ్రిటిష్‌ కాలం నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఐఈఏ (భారతీయ సాక్ష్యాధార చట్టం) చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్‌ 2023 పేరుతో మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు