Rahul Gandhi: ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే ప్రధాని బిజీ: రాహుల్‌ గాంధీ

ప్రధాని మోదీ, ఆయన సర్కారు రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Published : 24 Jun 2024 20:08 IST

దిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. కేంద్ర సర్కారు రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపిస్తూ.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు పార్లమెంటు ప్రాంగణంలోనూ రాహుల్‌ ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

‘‘రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదు. రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదు. మేం దానిని కాపాడతాం. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకూ చేరుతోంది’’ అని మీడియాతో రాహుల్‌ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్‌’ వేదికగా ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘‘అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్‌, టోల్‌ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి’’ అని ట్వీట్‌ చేశారు.

ఎమర్జెన్సీ ప్రకటించకుండానే కొనసాగింపు: ఖర్గే

ఇంత జరుగుతున్నా.. ప్రధాన మంత్రి మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. బలమైన ప్రతిపక్షం కేంద్ర సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించడంతోపాటు జవాబుదారీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవడాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. అంతకుముందు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల ప్రారంభం వేళ ‘ఇండియా’ కూటమి నేతలు రాజ్యాంగ ప్రతిని చేతపట్టి లోక్‌సభ ఛాంబర్‌వైపు ప్రదర్శనగా వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని