Uddhav Thackeray: ‘ఇకపై లిఫ్ట్‌లో సీక్రెట్‌ మీటింగ్‌’.. ఫడణవీస్‌తో భేటీపై ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు

Uddhav Thackeray: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై లిఫ్ట్‌లో సీక్రెట్‌ మీటింగ్స్‌ పెట్టుకుంటామని అన్నారు. అసలేం జరిగిందంటే..?

Published : 27 Jun 2024 18:00 IST

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల (Maharashtra Assembly Session) వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు, మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray), దేవేంద్ర ఫడణవీస్‌ ఎదురుపడ్డారు. లిఫ్ట్‌ కోసం వీరిద్దరూ కలిసి ఎదురుచూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకోవడంతో పాటు కొంతసేపు మాట్లాడుకున్నారు. వారు ఏ విషయం గురించి చర్చించుకున్నారో తెలియదు గానీ.. సీరియస్‌ చర్చేనంటూ ప్రచారం జోరందుకుంది.

దీనిపై ఉద్ధవ్‌ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాము రహస్య సమావేశాలన్నీ లిఫ్ట్‌లోనే పెట్టుకుంటామంటూ సరదాగా అన్నారు. ‘‘దేవేంద్ర (Devendra Fadnavis)జీ, నేను ఒకే లిఫ్ట్‌లో వెళ్లినప్పుడు.. బహుశా చాలా మంది అనేక రకాలుగా అభిప్రాయపడి ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదు. మేం అనుకోకుండా కలిశామంతే..!’’ అని ఠాక్రే తెలిపారు.

శాం పిట్రోడాకు బాధ్యతలు.. మోదీజీ ఆనాడే చెప్పారు: కిరణ్‌ రిజిజు

ఇక, భాజపా మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ గురువారం మర్యాదపూర్వకంగా ఠాక్రే (Uddhav Thackeray)ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రి ఓ చాక్లెట్‌ ఇచ్చారు. దీనికి శివసేన (యూబీటీ) నేత బదులిస్తూ.. ‘రేపు (రాష్ట్ర బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ) మహారాష్ట్ర ప్రజలకు కూడా మీరు చాక్లెట్లు ఇవ్వాలి మరి’ అని అన్నారు.

మహారాష్ట్ర (Maharashtra News) అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం సీఎం ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు ఇవి. ఓటర్లను ఆకర్షించేందుకు బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని