Rahul Gandhi: ‘మోదీజీ నవ్వరెందుకో’.. రాహుల్‌ ప్రశ్నకు ప్రధాని ఏం చెప్పారంటే?

Rahul Gandhi: లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మోదీజీ ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారని అడగ్గా.. ప్రధాని దీనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

Published : 01 Jul 2024 17:46 IST

దిల్లీ: లోక్‌సభ సమావేశాలు (Lok sabha Session) సోమవారం వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మతపరమైన వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా తప్పుబట్టింది. ఇక, రాహుల్‌ ప్రసంగంలో కొన్ని ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకున్నాయి. మోదీజీ (PM Modi) ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారని ఆయన అడగ్గా.. ప్రధాని దీనికి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

‘‘సభాపక్ష నేత అయిన ప్రధాని మోదీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాల్లేవ్‌. కనీసం మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కూడా కన్పించదు. మోదీజీ (Narendra Modi) ఎందుకు ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు?’’ అని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. దీనికి సభలో ఉన్న ప్రధాని వెంటనే బదులిస్తూ.. ‘‘ప్రతిపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి’’ అని అన్నారు. దీంతో అధికార పక్షం సభ్యులంతా నవ్వులు చిందించారు.

లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం

రాసిపెట్టుకోండి: రాహుల్‌ ఛాలెంజ్‌

ఇక, లోక్‌సభ వేదికగా ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ (LOP Rahul Gandhi) బహిరంగ సవాల్‌ విసిరారు. ‘‘నేను గుజరాత్‌ వెళ్లి టెక్స్‌టైల్‌ పరిశ్రమ యజమానులతో మాట్లాడా. నోట్ల రద్దు, జీఎస్‌టీని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? అని వారిని అడిగా. అది కేవలం బిలియనీర్ల కోసమే అని వారు చెప్పారు. ప్రధాని కేవలం సంపన్నుల కోసమే పనిచేస్తున్నారు. భాజపాకు నేను చెప్పేది ఒక్కటే..! రాసిపెట్టుకోండి వచ్చే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి వారిని ఓడిస్తుంది’’ అని అన్నారు.

అయోధ్య సందేశమిచ్చింది..

ఈ సందర్భంగా అయోధ్య (Ayodhya) ఆలయం ఉన్న యూపీలోని ఫైజాబాద్‌ స్థానంలో భాజపా ఓటమిపై స్పందిస్తూ రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ‘‘శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య మీకు సరైన సందేశమిచ్చింది. ప్రజల భూములు లాక్కొని గుడికట్టిన మీకు తగిన సమాధానం చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం సమయంలో దేశవ్యాప్తంగా సంపన్నులను ఆహ్వానించిన మీరు అయోధ్య ప్రజలను మాత్రం పిలవలేదు’’ అంటూ దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని