Supreme court: సినిమాల్లో దివ్యాంగులను ఎగతాళి చేయడమేంటి?

సినిమాలు, ఇతర దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

Updated : 09 Jul 2024 12:32 IST

దిల్లీ: సినిమాలు, ఇతర దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా చూపించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నవ్వు తెప్పించడం కోసం దివ్యాంగుల పాత్రలను వాడుకోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. వారిని గౌరవప్రదంగా చూపించాలంటూ దృశ్యమాధ్యమాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దివ్యాంగుల పాత్రలను ఓ మూసపద్ధతిలో చూపించడం మానుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల సమాజంలో వారిపై వివక్ష, అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రలను సృష్టించే సమయంలో రూపకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని, దివ్యాంగులపై వినియోగించే భాష విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. వికలాంగుడు, మందబుద్ధి లాంటి పదాలు వాడకూడదని పేర్కొంది. వారి వైద్యపరిస్థితిని వాస్తవాలకు దగ్గరగా చూపించాలని, వక్రీకరించకూడదని మార్గదర్శకాల్లో ధర్మాసనం (Supreme Court) స్పష్టం చేసింది. వాస్తవాలను చిత్రీకరించడానికి దృశ్య మాధ్యమాలు కృషి చేయాలని తెలిపింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను మాత్రమే కాకుండా వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విషయంలో రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటులకు అవగాహన ఉండాలని.. ఇందుకోసం కార్యక్రమాలు రూపొందించాలని తెలిపింది. బాలీవుడ్‌ సినిమా (Bollywood Movie) ‘ఆంఖ్‌ మిచోలీ’లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్‌ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ సోమవారం ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని