Bhole Baba: అందుకే భోలే బాబాను ఇంకా అరెస్టు చేయలేదు: పోలీసులు

హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబాను ఇంకా అరెస్టు చేయకపోవడంపై పోలీసులు స్పందించారు.

Published : 04 Jul 2024 18:24 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌లో జరిగిన సత్సంగ్‌ కార్యక్రమంలో తొక్కిసలాట ఘటన 121 మంది ప్రాణాల్ని బలితీసుకొంది. ఈ దుర్ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోలే బాబా (Bhole Baba) పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. ఆయన్ను ఎందుకు ఇప్పటివరకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలకు పోలీసులు స్పందించారు.

‘‘తొక్కిసలాట ఘటనకు సంబంధించి దర్యాప్తు మొదలైంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా కొందరిని అరెస్టు చేశాం. కానీ, ఇప్పటివరకు భోలే బాబా (సూరజ్‌ పాల్‌) ఆచూకీ తెలియలేదు. ఆయన్ను ప్రశ్నించాల్సి ఉంది. కచ్చితంగా సూరజ్‌ పాల్‌ను విచారిస్తాం. సేవాదార్‌ వేద్‌ ప్రకాశ్‌ మధుకర్‌ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. నిర్వాహక కమిటీ అనుమతి తీసుకున్న నేపథ్యంలో అందులోని ప్యానెల్‌ సభ్యులను అరెస్టు చేశాం’’ అని అలీగఢ్‌ రేంజ్‌ ఐజీ షలాభ్‌ మాథుర్‌ పేర్కొన్నారు.

ఆచూకీ లేని ‘భోలే బాబా’.. బాధితుల్లో ఆక్రోశం!

ఆచూకీ చెబితే.. రూ.లక్ష రివార్డు

పరారీలో ఉన్న భోలే బాబా కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఐజీ తెలిపారు. అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు. అదుపులో ఉన్న వారిని విచారిస్తున్నామని.. తొక్కిసలాటలో ఇతర వ్యక్తుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. యూపీకి చెందిన సూరజ్‌ పాల్‌పై గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో దోషిగా తేలిన ఆయన కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. బయటకు వచ్చాక బాబా అవతారమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని