Kejriwal: సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌.. మండిపడిన ఆప్‌

బెయిల్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపేందుకు సిద్ధమైన సమయంలోనే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది.

Published : 26 Jun 2024 21:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI).. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. ఐదు రోజుల కస్టడీని సీబీఐ కోరినప్పటికీ న్యాయస్థానం అందుకు నిరాకరించింది. అయితే, బెయిల్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపేందుకు సిద్ధమైన సమయంలోనే సీబీఐ అరెస్టు చేయడంపై ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది.

మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో బుధవారం ఉదయం హాజరు పరిచారు. అదే సమయంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకరించింది. న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలతో ఆయన్ను అరెస్టు చేసింది. అనంతరం ఐదురోజుల కస్టడీ కోరినప్పటికీ మూడు రోజులకు అనుమతించింది.

వ్యవస్థలన్నీ అడ్డుకుంటున్నాయ్‌ - సునీత

మరోవైపు కేజ్రీవాల్‌ను బెయిల్‌పై బయటకు రాకుండా వ్యవస్థలన్నీ అడ్డుకుంటున్నాయని సునీత కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఇది నియంతృత్వం మాదిరిగానే కనిపిస్తోందన్నారు. ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ వచ్చిన వెంటనే దాన్ని ఈడీ అడ్డుకుందని.. తాజాగా సీబీఐ ఆయన్ను అరెస్టు చేసిన తీరు ఇందుకు అద్దం పడుతోందన్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆమ్‌ఆద్మీపార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. బెయిల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసే సమయంలోనే సీబీఐ ఆయన్ను అదుపులోకి తీసుకోవడం దారుణమని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇంతకంటే అత్యయిక స్థితి ఉండదని, ఈ విషయంలో భాజపా ప్రతీకార రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని