NEET Row: ఎన్‌టీఏ కొత్త చీఫ్‌ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా గురించి తెలుసా?

NEET Row| నీట్‌, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) కొత్త చీఫ్‌గా నియమితులైన ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా గురించి కొన్ని విశేషాలు ఇవే..

Published : 23 Jun 2024 20:17 IST

దిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు రాసిన నీట్‌ (యూజీ), యూజీసీ-నెట్‌ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం దేశాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలను ముమ్మరం చేసింది. శనివారమే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఎన్‌టీఏ కొత్త డీజీగా ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను నియమించింది. మరోవైపు, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ (CBI)ని ఆదేశించగా.. రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

నీట్‌ పరీక్షల్లో ‘మున్నాభాయ్‌’లు.. వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!

ఎవరీ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా? 

జాతీయ పరీక్షల సంస్థ (NTA) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా కర్ణాటక క్యాడర్‌కు చెందిన 1985వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.  ప్రస్తుతం భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) ఛైర్మన్‌గా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇందౌర్‌ యూనివర్సిటీ నుంచి 1982లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శిగానూ 2001 నుంచి 2004 వరకు కొనసాగారు. కేంద్ర పర్యాటకశాఖ డైరెక్టర్‌గానూ సేవలందించారు. నేషనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రీఫార్మ్‌ కమిషన్‌లో 2012లో జాయింట్‌ సెక్రటరీ హోదాలో పనిచేసిన ఆయన.. ఈ-గవర్నెన్స్‌లో జాతీయ అవార్డు అందుకున్నారు. 1984లో ఐఐటీ దిల్లీ నుంచి ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తి చేశారు. ప్రధానమంత్రి అవుట్‌ స్టాండింగ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అవార్డును సైతం అందుకొన్నారు.  దీంతో పాటు ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 63 ఏళ్లు. ఎన్‌టీఏకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించేంత వరకు ఈ బాధ్యతల్లో ఖరోలా కొనసాగనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని