Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టు ఘటన.. నాటి పౌర విమానయానశాఖ మంత్రి ఏమన్నారంటే

దిల్లీ విమానాశ్రయ ఘటనపై విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని ఎన్సీపీ నేత, పౌరవిమానయానశాఖ మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ మండిపడ్డారు.

Published : 28 Jun 2024 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ రాజధాని దిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పు కొంతభాగం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ టర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే.. దాన్ని 2009లోనే ప్రారంభించారని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలోనే అప్పటి పౌర విమానయానశాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ (Praful Patel) దీనిపై స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

‘‘సంబంధిత నిర్మాణాన్ని 15 ఏళ్ల క్రితం కట్టారు. ఇంతకాలం విస్తృతంగా వాడుకలో ఉంది. ఓ అత్యుత్తమ నిర్మాణ సంస్థ దీని పనులు చేపట్టింది. ఏదైనా భవనాన్ని నిర్మించినప్పుడు సహజంగానే డిజైన్, ప్లానింగ్‌లను సరిచూసుకుంటారు. కాబట్టి, 15 ఏళ్లనాటి కట్టడం గురించి వ్యాఖ్యానించబోను. అయితే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఏం జరిగిందన్న దానిపై నిర్ధరణకు వచ్చేందుకు సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రస్తుత ప్రమాదం విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తగదు. శవరాజకీయాలు మానుకోవాలి’’ అని ఓ వార్తాసంస్థతో వ్యాఖ్యానించారు.

కూలిన టెర్మినల్‌ పైకప్పు.. అది మోదీ ప్రారంభించినది కాదు: రామ్మోహన్‌ నాయుడు

ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌ యూపీఏ హయాంలో 2004- 2011 మధ్యకాలంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్సీపీ చీలిపోయిన సమయంలో అజిత్‌పవర్‌ వర్గంలో ఉన్నారు. అజిత్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని