Atishi: త్వరలో నీటి సమస్యకు పరిష్కారం: ఆతిశీ

భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని పంప్‌హౌస్‌ను జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ ఆదివారం సందర్శించారు.

Published : 30 Jun 2024 17:43 IST

దిల్లీ: భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌(Water Treatment Plant)లోని పంప్‌హౌస్‌ను దిల్లీ  జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ(Atishi)  ఆదివారం సందర్శించారు. త్వరగా దానికి మరమ్మతులు చేయాలని, సమస్య పునరావృతం కాకుండా చూడాలని, ఇతర ప్లాంట్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ప్లాంట్‌ గురించి ఎక్స్‌ వేదికగా ఆతిశీ మాట్లాడుతూ ‘‘అధిక వర్షాల వల్ల చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని పంపింగ్ హౌస్‌లో మోటార్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో నీటి అంతరాయం కలిగింది. సమస్యను పరిష్కరించడానికి జల్‌ బోర్డు రంగంలోకి దిగింది. ప్లాంట్లో దాదాపు 80 శాతం మరమ్మతులు పూర్తయ్యాయి. త్వరలో అంతరాయం లేకుండా నీటి సమస్యను పరిష్కరిస్తాం’’ అని తెలిపారు. 

దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. గత 24 గంటల్లో సఫ్దార్‌జంగ్‌లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. వాతావరణ శాఖ దేశ రాజధానిలో జులై 2వరకు ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించింది. ఇటీవల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం కూలి ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోహిణీ కాలనీలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి (39) మృతిచెందగా.. న్యూ ఉస్మాన్‌పుర్‌ ప్రాంతంలో వర్షపునీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు, నిలిచిన నీటిలో మునిగి మరో యువకుడు మృతిచెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని