Vande Bharat: వందేభారత్‌లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్‌!

వర్షం కురవడంతో పైకప్పు నుంచి వందేభారత్‌లోకి నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వేశాఖ ఏమందంటే..?

Published : 04 Jul 2024 00:02 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సెమీహైస్పీడ్‌ వందే భారత్‌ (Vande Bharat)లోని సౌకర్యాలపై తరచూ ఫిర్యాదు వస్తున్నాయి. టిక్కెట్‌ ధర ఎక్కువైనా ప్రయాణంలో సౌకర్యాల దృష్ట్యా చాలామంది ఈ ప్రీమియం రైలునే ఎంచుకుంటున్నా.. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా వందేభారత్‌ పైకప్పు నుంచి లోనికి నీరు చేరింది. దిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన రైలులో ఈ ఘటన చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల వారణాసికి బయలుదేరిన వందేభారత్‌లో వర్షం కారణంగా పైకప్పు నుంచి నీరు లోనికి చేరింది. సీట్లన్నీ తడిచిపోవడంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఏకధాటిగా నీరు పైనుంచి రావడంతో ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ప్రయాణికుడు రైల్వే సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘‘వందేభారత్‌లో ఇప్పటివరకు క్యాటరింగ్‌ సమస్యే ఉండేది. ఇక నుంచి మరో కొత్త సమస్యను ఎదుర్కొవాలి’’ అని ఒకరు.. ‘‘ఇకపై ప్రయాణికులు తడుస్తూ ప్రయాణించవచ్చు. ధర ఎక్కువ సేవలు తక్కువ’’ అని కామెంట్లు గుప్పించారు.

అదొక భయానక అనుభవం..ఎయిర్‌లైన్స్‌పై ప్రయాణికుడి పోస్టు

తాజా ఘటనపై ఉత్తర రైల్వే స్పందించింది. నీరు లోనికి రావడానికి గల కారణాన్ని వివరించింది. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. నీటి పైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతోనే ఈ విధంగా జరిగింది. నీరు లోనికి చేరింది. ఇలాంటి తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని ఓ ప్రకటనలో ప్రయాణికులను క్షమాపణలు కోరింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని