Presidential Election: ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నిక

దేశ తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆనవాయితీ ప్రకారం పార్లమెంట్‌ భవనంలో ఎంపీలు

Updated : 18 Jul 2022 12:17 IST

దిల్లీ: దేశ తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆనవాయితీ ప్రకారం పార్లమెంట్‌ భవనంలో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 

పార్లమెంట్‌ ప్రాంగణంలో ఓటింగ్‌ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఓటు వేశారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సీఎం భూపేంద్ర పటేల్‌, చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తొలి ఓటు వేశారు.

రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులంతా ఎన్నికల సిబ్బంది ఇచ్చే ప్రత్యేక పెన్నుతోనే ఓటు వేయాలి. బ్యాలెట్‌ పత్రం ఆధారంగా జరిగే ఈ ఎన్నికలో వరుస క్రమంలో ద్రౌపదీ ముర్ము, యశ్వంత్‌ సిన్హా పేర్లు ఉండనున్నాయి. ఓటర్లు తాము ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పక్కన ప్రాధాన్య సంఖ్యను అంకెల రూపంలో వేయాల్సి ఉంటుంది.

అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము గెలుపు దాదాపు ఖాయమే.  భాజపా, ఎన్డీయే కూటమి పక్షాలతోపాటు, బీజేడీ, వైకాపా, బీఎస్‌పీ, ఏఐఏడీఎంకె, జేడీఎస్‌, తెదేపా, అకాలీదళ్‌, శివసేన, జేఎంఎం పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు 60%కి పైగా ఓట్లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.  ఈనెల 21న ఫలితం ప్రకటించిన తర్వాత దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తొలి గిరిజన మహిళగా ద్రౌపదీ ముర్ము చరిత్రకెక్కనున్నారు. ప్రస్తుతం నికరంగా 10.81 లక్షల ఓట్లున్న ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయే అభ్యర్థికి 6.66 లక్షల ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని