NEET UG-2024: నీట్‌ వివాదం.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు

నీట్ పరీక్షల అవకతవకలపై విమర్శలు చెలరేగుతోన్న సమయంలో దానిని రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలపై నటుడు విజయ్ (Vijay) స్పందించారు. 

Published : 03 Jul 2024 12:27 IST

చెన్నై: దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీట్‌యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. అదే సమయంలో పేపర్ లీక్‌ ఘటనలు వెలుగులోకి రావడం దుమారం రేపింది. దీనిపై చర్చ జరపాలని పార్లమెంట్‌లో విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ అధినేత విజయ్‌ (Vijay) తొలిసారి స్పందించారు.

‘‘నీట్ పరీక్షపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అది ఈ దేశానికి అవసరం లేదు. నీట్‌ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. ఆ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలి. తాత్కాలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి ‘ప్రత్యేక ఉమ్మడి జాబితా’ను తయారుచేయాలి. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలి’’ అని సూచించారు.

నీట్‌-యూజీని మళ్లీ నిర్వహించాలి

ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించింది. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అధికారపక్షంతోపాటు విపక్ష నేతలు కూడా ఆమోదం తెలిపారు. నీట్‌ పరీక్ష వద్దని తమిళనాడు పదేపదే చెబుతోందని ఆ సందర్భంగా గుర్తు చేసిన డీఎంకే ఎంపీ కనిమొళి.. నీట్‌ నిర్వహణలో డొల్లతనం బయటపడిందన్నారు. ఈ పరీక్ష వల్ల విద్యార్థులు ఎంతో కోల్పోతున్నారని పేర్కొన్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో మే 5న నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం. అంతేకాకుండా ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్‌ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని