Supreme Court: పీజీ చేసిన ఉద్యోగికి.. లీవ్‌లెటర్‌ రాయడం రాకుంటే ఎలా? - సుప్రీం కోర్టు

దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని.. అటువంటి వారు నైపుణ్యాలను మెరగుపరచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 28 Jun 2024 19:35 IST

దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బోధన సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ బిహార్‌లో స్థానిక సంస్థలు నియమించుకున్న ఉపాధ్యాయులు చేసిన అభ్యర్థనను భారత సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని.. అటువంటి వారు నైపుణ్యాలను మెరగుపరచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టం లేనివారు ఉద్యోగాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

‘‘గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలను చూడండి. ఉద్యోగం పొందిన ఓ పోస్టుగ్రాడ్యుయేట్‌కు కనీసం లీవ్‌ లెటర్‌ కూడా రాయరాని పరిస్థితి. మన దేశంలో విద్యాస్థాయి ఇదేనా? వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తుంటే దాన్ని మీరు సవాలు చేస్తున్నారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. ఇటువంటి పరీక్షలను ఎదుర్కోలేమని చెప్పేవారు.. ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లండి’’ అని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు లేదా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదవించే స్తోమత అందరికీ ఉండదని అభిప్రాయపడింది.

జలమయంగా దిల్లీ: ఎంపీని ఎత్తుకొని వచ్చి.. కారులో కూర్చోబెట్టి..!

బిహార్‌లో పంచాయతీ, స్థానిక సంస్థల ద్వారా సుమారు 4 లక్షల మంది టీచర్లను నియమించారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వ నియామకాల ద్వారా ఎంపికయ్యే స్కూల్‌ టీచర్లతో సమాన హోదా కల్పించేందుకుగాను 2023లో కొత్త రూల్స్‌ తీసుకువచ్చారు. ప్రభుత్వం నిర్వహించే బోధన సామర్థ్య పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధన పెట్టారు. ఇది తప్పనిసరి కాదని.. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే ప్రభుత్వ ఉపాధ్యాయుల హోదా లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనిని అక్కడి హైకోర్టు కూడా సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ పలు కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని