Indian Army: భారత ఆర్మీకి 30వ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు

భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు.

Updated : 01 Jul 2024 06:07 IST

నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠీకి ఉపేంద్ర సహాధ్యాయి, బాల్యమిత్రుడు

దిల్లీ: భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆదివారం పదవీ విరమణ చేయగా.. ఆయన స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే నేవీ చీఫ్‌గా కొనసాగుతున్న అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠీకి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సహాధ్యాయి, చిన్ననాటి మిత్రుడు కావడం విశేషం. భారత రక్షణదళాల చరిత్రలో ఇది అపూర్వమైన ఆత్మీయఘట్టం. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు భారత సైన్యం, నావికాదళాలకు చీఫ్‌లుగా అత్యున్నత పదవుల్లో సారథ్య బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ 1970ల ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని రీవా సైనిక్‌ స్కూలులో 5వ తరగతి నుంచీ సహ విద్యార్థులు, మంచి స్నేహితులు. సైన్యంలో చేరాక వివిధ ప్రాంతాల్లో వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ, ఆ స్నేహం అలాగే కొనసాగింది. దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా వీరి నియామకాలు దాదాపు రెండు నెలల వెనుకా ముందు జరగడం గమనార్హం. అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి గత ఏప్రిల్‌ నెలాఖరున భారత నౌకాదళ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి కొనసాగుతుండగా.. లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది తాజాగా ఆర్మీ చీఫ్‌ అయ్యారు.

పాండే స్థానంలో బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది 1964 జులై 1న జన్మించారు. 1984 డిసెంబర్‌ 15న జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ రెజిమెంటులో చేరి, వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. భారతసైన్యంలో వైస్‌ చీఫ్‌గా ఉంటూ.. ఇప్పుడు 13 లక్షల బలమైన సైనికశక్తి గల ఆర్మీకి 30వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి విస్తృతమైన ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీకి ఉన్నట్లు భారత ఆర్మీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని