crime news: 100కుపైగా రుణ యాప్స్‌తో రూ.500 కోట్ల వసూళ్లు

దేశ వ్యాప్తంగా రుణ యాప్స్‌ నిర్వహిస్తూ రూ. 500 కోట్లు వసూలు చేసిన 22 మంది సభ్యుల గ్యాంగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాకెట్‌ను చైనా జాతీయులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

Updated : 21 Aug 2022 11:16 IST

 వినియోగదారుల డేటా చైనాకు.. యూపీ గ్యాంగ్‌ నిర్వాకం

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా రుణ యాప్స్‌ నిర్వహిస్తూ రూ.500 కోట్లు వసూలు చేసిన 22 మంది సభ్యుల ముఠాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాకెట్‌ను చైనా జాతీయులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా మొత్తం 100కుపైగా రుణ యాప్‌లను నిర్వహిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి చైనా,హాంకాంగ్‌లో ఉన్న సర్వర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు విచారణలో తేలింది.

దిల్లీ పోలీసులు సుమారు రెండు నెలలపాటు ఈ గ్యాంగ్‌  కార్యకలాపాలపై నిఘాపెట్టారు. ఈ గ్యాంగ్‌ నెట్‌వర్క్‌ దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌లకు విస్తరించింది. ఈ ముఠా లఖ్‌నవూలో ఓ కాల్‌ సెంటర్‌ ద్వారా చిన్నమొత్తాల్లో రుణాలు మంజూరు చేస్తోంది. ఈ లోన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగదారులు రుణానికి దరఖాస్తు చేసుకోగానే..  ఫోన్‌లో పలు పర్మిషన్లు అడుగుతుంది. అదే సమయంలో వినియోగదారుల కాంటాక్ట్‌ లిస్ట్‌, కాల్‌ లాగ్‌, చిత్రాలు చైనా సర్వర్‌లో అప్‌లోడ్‌ అవుతాయి.

ఆ తర్వాత రుణ వసూలు కోసం ఈ గ్యాంగ్‌ ఫేక్‌ ఐడీలతో తీసుకొన్నఫోన్‌ నంబర్ల నుంచి వినియోగదారులకు కాల్స్‌ వెళతాయి. రుణం చెల్లించకపోతే వినియోగదారుల మార్ఫింగ్‌ చేసిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసి బెదిరిస్తారని.. దిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ కేపీఎస్‌ మల్హోత్రా పేర్కొన్నారు. వినియోగదారులు భయపడి చెల్లింపులు చేసిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలు, హవాలా మార్గంలో చైనాకు తరలిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ రోజుకు కనీసం రూ.కోటి వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 51 ఫోన్లు, 25 హార్డ్‌ డిస్క్‌లు, తొమ్మిది ల్యాప్‌టాప్‌లు, 19 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, మూడు కార్లు, రూ.4లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని