Bhole Baba: జైలుకెళ్లి.. బాబాగా మారి.. ‘భోలే’ పాదధూళి కథేంటీ?

Hathras Stampede: హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన భోలే బాబా గతంలో ఓ లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లినట్లు తెలుస్తోంది. 

Updated : 03 Jul 2024 16:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతడు తన చేతితో నీరు ఇస్తే సమస్యలను తీరుతాయట.. అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకినా ఆశీర్వాదం అట.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘భోలే బాబా (Bhole Baba)’ను అనుసరించేవారి నమ్మిక ఇది. అందుకే ఆయన పాద ధూళి కోసం ఎగబడిన భక్తులు దురదృష్టవశాత్తూ అదే మట్టిలో కలిసిపోయారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హాథ్రస్‌ తొక్కిసలాట (Hathras Stampede) ఘటనతో ఈ బాబా పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఇంతకీ ఎవరాయన? పోలీసు శాఖలో పనిచేసి.. లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లిన వ్యక్తి బాబాగా ఎలా మారాడు?

18 ఏళ్ల పాటు పోలీసుశాఖలో..

యూపీకి చెందిన నారాయణ్‌ సాకార్‌ హరి.. సాకార్‌ విశ్వ హరి, ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. అతడి అసలు పేరు సూరజ్‌ పాల్‌. ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన అతడు.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. చదువు పూర్తయిన తర్వాత రాష్ట్ర పోలీసు శాఖలో చేరి 18 ఏళ్ల పాటు పనిచేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాను ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. ఆ తర్వాత వీఆర్‌ఎస్‌ తీసుకుని ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు.

లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లి..

అయితే, పోలీసు శాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత సూరజ్‌ పాల్‌ కొన్ని కేసులు ఎదుర్కొన్నట్లు యూపీ పోలీసు వర్గాలు తెలిపాయి. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో 1997లో అరెస్టయి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడట..! ఆ తర్వాత బయటకు వచ్చి తన పేరును ‘సాకార్‌ విశ్వ హరి బాబా’గా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరిచాడు. తనకు గురువు ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.

నీళ్ల కోసం భక్తుల క్యూ..

అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. కొన్నిసార్లు లక్షల్లో జనం వస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాకుండా ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఇతడి కార్యక్రమాలను నిర్వహించే వారు నల్లటి దుస్తులు ధరించి ఎన్‌ఎస్‌జీ కమాండో మాదిరిగా ఉంటారు. వీరిని ‘సేవాదర్‌ ఆర్మీ’గా పిలుస్తుంటారు.

సాధారణంగా ఆశ్రమంలో నిర్వహించే సత్సంగ్‌ కార్యక్రమాల్లో భక్తులకు నీటిని పంపిణీ చేస్తుంటారు. అవి తాగితే సమస్యలన్నీ తొలగిపోతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అతడి ఆశ్రమంలో ఓ చేతిపంపు ఉంటుంది. దాన్ని పవిత్ర జలంగా భావించి ఆ నీరు తీసుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు.

ఎప్పుడూ తెల్లటి దుస్తులే..

భోలే బాబా ఎప్పుడూ తెల్లటి సూట్‌ ధరించి టోపీ పెట్టుకుని కన్పిస్తాడు. ఏ కార్యక్రమానికి వచ్చినా భార్య వెంట ఉండాల్సిందే. కొవిడ్‌ సమయంలో అతడి పేరు తొలిసారిగా దేశమంతా వినిపించింది. ఆ సమయంలో సత్సంగ్‌ కార్యక్రమం కోసం 50 మంది భక్తులు వస్తారని ఆర్గనైజర్లు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ, ఆ కార్యక్రమానికి ఏకంగా 50వేల మంది రావడం అప్పట్లో వివాదస్పదమైంది.

పాదధూళి కోసం వెళ్లి..

హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో మంగళవారం నిర్వహించిన సత్సంగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు 80వేల మందికి పోలీసులు అనుమతినిచ్చారు. కానీ, బాబా దర్శనం కోసం ఏకంగా 2.5లక్షల మంది వరకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంటన్నర పాటు భోలే బాబా ప్రవచనాలు పూర్తయిన తర్వాత  కారులో వెళ్లిపోయాడు. ఆయన వాహనం వెళ్లి మార్గంలోని మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్వాదం లభించినట్లేనని విశ్వసించిన భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకుని కిందపడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి పెను విషాదం నెలకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు