UGC NET: ఆదివారమే లీక్‌.. ఆ వెంటనే డార్క్‌ నెట్‌లో: ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి

నీట్ పేపర్ లీక్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోన్న తరుణంలో.. యూజీసీ నెట్‌(UGC NET) పరీక్ష రద్దు కావడం సంచలనం కలిగించింది. దానిలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 

Published : 21 Jun 2024 13:55 IST

దిల్లీ: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్‌ జూన్‌-2024 (UGC-NET) పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షా పత్రాన్ని ఆదివారమే లీక్‌ చేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దానిని ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని పేర్కొన్నాయి. దీని దర్యాప్తులో భాగంగా ప్రాథమికంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

యూజీసీ-నెట్ పరీక్షను జూన్ 18న(మంగళవారం) నిర్వహించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. అందులో వివరాల ప్రకారం.. పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. దాంతో వెంటనే ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

యూజీసీ నెట్‌ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి ఈ పరీక్షను కేంద్రం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్‌టీఏ నిర్వహించిన నీట్‌ పరీక్షపై తీవ్ర వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో నెట్‌ పరీక్షలోనూ అవకతకవలు జరగడం, పరీక్ష రద్దు కావడం సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని