Tejashwi yadav: నీట్‌ పేపర్‌ లీకేజీ కుట్రలో అసలు సూత్రధారి నీతీష్‌ కుమార్‌: తేజస్వీ యాదవ్

నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో తనను ఇరికించాలని భాజపా ప్రయత్నిస్తోందని, తనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయోజనం ఉండదని తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 21 Jun 2024 18:39 IST

పట్నా: దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు రేపుతున్న నీట్‌(NEET) పేపర్‌ లీక్‌ కేసులో భాజపా తనను ఇరికించాలని ప్రయత్నిస్తోందని ఆర్జేడీ(RJD) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మండిపడ్డారు. కేసులో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వి వ్యక్తిగత సహాయకుడికి పరిచయం ఉందని భాజపా(BJP) ఆరోపించింది. దీనిపై ఆయన స్పందిస్తూ పేపర్‌ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ అని వ్యాఖ్యానించారు. భాజపా అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయన్నారు.

‘‘ఈ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉంది. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలనుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పేపర్ లీక్‌కు అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నీతీష్ కుమార్‌లే’’ అని తేజస్వి ఆరోపించారు. ప్రధాన నిందితుడికి ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు సంబంధం ఉందని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్జేడీ నేతలు తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రధాన నిందితుడు అమిత్‌ ఆనంద్‌ బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఉన్నారు. కేసులో ఆనంద్‌ పేరు బయటకు రాగానే అతడితో ఉన్న ఫొటోలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి డిలీట్‌ చేశారన్నారు. కానీ అవన్నీ తమ వద్ద భద్రంగా ఉన్నాయని,  వాటి ద్వారా అసలైన దోషులు ఎవరో తెలుస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని