PM Modi: నాడు ఎమర్జెన్సీ విధించి.. నేడు రాజ్యాంగంపై ‘ప్రేమ’ నాటకాలా?: మోదీ

PM Modi: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదన్నారు.

Updated : 25 Jun 2024 13:36 IST

దిల్లీ: దేశంలో అత్యయిక స్థితి (Emergency Days) ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌లు పెట్టారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణలకు ప్రధాని గట్టిగా బదులిచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనంటూ హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘ఎమర్జెన్సీని ఎదిరించిన మహనీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్‌ (Congress) ఎలా అణగదొక్కిందో.. ప్రతీ భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని (Constitution) ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటిరోజులే మనకు గుర్తు చేస్తాయి. కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది. ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు. బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు’’ అని మోదీ (Narendra Modi) నాటి పరిస్థితులను గుర్తుచేశారు.

50వ ఏడాదిలోకి ‘ఎమర్జెన్సీ’

‘‘నాడు ఎమర్జెన్సీ (Emergency days)ని విధించిన వారికి (కాంగ్రెస్‌) ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు. ప్రతికా స్వేచ్ఛను నాశనం చేయడానికి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు. ఫెడరల్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాజ్యాంగంలోని ప్రతీ అంశాన్ని ఉల్లంఘించారు. నాటి సంకుచిత, కుటిల మనస్తత్వం ఆ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది. రాజ్యాంగంపై తమకున్న అయిష్టాన్ని దాచిపెట్టి వారు ఇప్పుడు నటిస్తున్నారు. కానీ చేష్టల్లో వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే పదేపదే వారిని తిరస్కరిస్తున్నారు’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమిని ఎద్దేవా చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమి పలుమార్లు రాజ్యాంగం (Constitution) మార్పు అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చేస్తారని విపక్ష నేతలు ఆరోపించారు. దీన్ని మోదీ సర్కారు ఎప్పటికప్పుడు కొట్టిపారేసింది. 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాల ప్రారంభ సమయంలోనూ రాజ్యాంగ ప్రతులను పట్టుకుని విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. అయితే, ఈ సమావేశాలకు ముందు ప్రధాని మాట్లాడుతూ ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు. అత్యయిక స్థితి దేశ చరిత్రపై మాయని మచ్చ అని, నాటి పొరపాటు భవిష్యత్తులో మళ్లీ జరగొద్దని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని