Ladakh: సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్‌లో ఐదుగురు జవాన్ల మృతి

Ladakh: లద్దాఖ్‌లో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు.

Updated : 29 Jun 2024 20:18 IST

లద్దాఖ్‌: చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ (Ladakh)లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్‌ ప్రాంతంలో భారత సైన్యం (Indian Army) విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలోని బోధి నదిలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో (Army Exercise) భాగంగా యద్ధ ట్యాంక్‌లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో నీటి ఉద్ధృతి పెరిగి టీ-72 ట్యాంక్‌ మునిగిపోయింది. అందులోని ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలించింది. అయితే, దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి కూడా ఉన్నారు.

రాజ్‌నాథ్‌ దిగ్భ్రాంతి..

ప్రమాదంపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ట్యాంక్‌తో నదిని దాటుతుండగా జరిగిన దురదృష్టకర ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. దేశం కోసం మన సైనికుల అపార సేవను ఎప్పటికీ మర్చిపోలేం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని