TN liquor: ప్రభుత్వ మద్యంలో ‘కిక్‌’ లేకపోవడంతోనే.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం!

తమిళనాడులో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్‌’ లేదంటూ డీఎంకే సీనియర్‌ నేత చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.

Published : 01 Jul 2024 00:06 IST

చెన్నై: ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో ‘కిక్‌’ లేదంటూ తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాకుండా టీఏఎస్‌ఎంఏసీ దుకాణాల ద్వారా విక్రయించే మద్యం రోజువారీ కూలీలకు శీతల పానీయమని పేర్కొన్నారు. కల్తీసారా ఘటనతో రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తోన్న వేళ మంత్రి చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘మద్యం నిషేధంపై ఎంతోమంది మాట్లాడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు సాగుతున్నప్పుడు ఇక్కడ ప్రభావితం కాకుండా ఉండదని డీఎంకే దిగ్గజనేత కరుణానిధి గతంలోనే చెప్పారు. కష్టపడి పనిచేసేవారికి ఉపశమనం కోసం మద్యం అవసరం. అటువంటివారికి ఇది శీతలపానీయం లాంటిది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే మద్యంలో వారికి అవసరమైన ‘కిక్‌’ లభించకపోవడంతో కొందరు నాటుసారాను ఆశ్రయిస్తున్నారు’’ అని దురైమురుగన్‌ పేర్కొన్నారు.

చిన్ననాటి స్నేహితులు..దేశ అత్యున్నత అధికారులుగా

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న కల్తీ సారా ఘటనలో 65 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ఎక్సైజ్‌ చట్టాన్ని బలోపేతం చేసేందుకు ఓ బిల్లును తీసుకువచ్చింది. దీనిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా పీఎంకే ఎమ్మెల్యే జీకే మణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలన్నారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి దురైమురుగన్‌.. కష్టపడేవారికి ఇది ఎంతో అవసరమన్నారు.

మంత్రి చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే తీవ్ర స్థాయిలో మండిపడింది. కల్లకురిచ్చి విషాదానికి డీఎంకే ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించింది. వారి అధినేతను కాపాడుకునేందుకే దురైమురుగన్‌ అలా మాట్లాడినట్లు కనిపిస్తోందని మండిపడింది. మంత్రి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పీఎంకే నేత అన్బుమణి రాందాస్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5వేల మద్యం దుకాణాలున్నా.. కల్తీసారా యథేచ్ఛగా లభిస్తోందన్నారు. ఈ విషయంలో కార్మికులపై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని