RajyaSabha: రాజ్యసభలో గరం గరం.. ఖర్గే, ధన్‌ఖడ్‌ మధ్య మాటల యుద్ధం

నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చ జరపాలంటూ రాజ్యసభలో విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం జరిగింది.

Published : 28 Jun 2024 22:15 IST

దిల్లీ: నీట్‌ యూజీ-2024 (NEET UG-2024) పేపర్‌ లీకేజీ వ్యవహారం ఉభయసభల్లో అగ్గి రాజేస్తోంది. లోక్‌సభలో (LokSabha) ఈ అంశంపై చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్‌కు సభాపతి నిరాకరించడంతో సభలో గందరగోళం తలెత్తింది. దీంతో సభ జులై 1 (సోమవారం)కి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ (Rajyasabha) ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) పరస్పరం ఘాటు విమర్శలు చేసుకున్నారు. ప్రతిపక్షంపై ఛైర్మన్‌ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నీట్‌పై చర్చ కోరుతూ తొలుత ఖర్గే, ప్రతిపక్ష సభ్యులతో కలిసి వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధన్‌ఖడ్‌.. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్న వ్యక్తులెవరూ వెల్‌లోకి రాలేదని, ఈ పరిస్థితులను చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. 

దీనిపై స్పందించిన ఖర్గే.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని దాదాపు 10 నిమిషాలపాటు చేతులు ఎత్తుతూనే ఉన్నామని అప్పటికీ పట్టించుకోకపోతేనే వెల్‌లోకి వచ్చామని చెప్పారు. ‘భారత పార్లమెంట్‌ చరిత్రలోనే ఇదో చీకటి రోజు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఛైర్మన్‌ కూడా అదే స్థాయిలో స్పందించారు ‘‘ ప్రతిపక్ష నేత చెప్పినట్లుగా భారత పార్లమెంట్‌ చరిత్రలో ఇది చీకటి రోజే. ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తి వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇలాంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. నేను షాక్‌కు గురయ్యా. చాలా బాధనిపించింది. ప్రతిపక్షనేత, ఉపనేత వెల్‌లోకి దూసుకొచ్చేంత స్థాయికి పార్లమెంట్‌ సంప్రదాయం దిగజారిపోయింది’’ అంటూ సభను వాయిదా వేశారు.

సభలో తమ గొంతు వినిపించేందుకు ఛైర్మన్‌ సహకరించడం లేదని, విధిలేని పరిస్థితుల్లోనే వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని ఖర్గే తెలిపారు.‘‘ ఇది పూర్తిగా ఛైర్మన్‌ తప్పిదం. పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని దాదాపు 10 నిమిషాల పాటు చేతులు ఎత్తాను. కానీ, ఆయన నావైపు అసలు చూడలేదు. సభ్యులంతా వెల్‌లోకి వెళ్లడంతో.. నేను బయటకి వచ్చేశాను. పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం.. ఎవరైనా సభ్యుడు చేయి ఎత్తితే.. ఛైర్మన్‌ కచ్చితంగా అతడివైపు చూడాలి. కానీ, ఛైర్మన్‌ ట్రెజరీ బెంచీలవైపే చూశారు తప్ప.. నా వైపు చూపు తిప్పలేదు. నన్ను కించపరచాలనే ఉద్దేశంతోనే అలా వ్యవహరించారు’’ అని విమర్శించారు. నీట్‌ పరీక్ష వ్యవహరంలో భారీ కుంభకోణం జరిగిందని ఖర్గే ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్న పేపర్‌ లీకేజీపై చర్చించాలని డిమాండ్‌ చేస్తుంటే అధికార పక్షం ఎందుకు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని