NEET row: నీట్‌ కౌన్సెలింగ్‌ వాయిదాకు సుప్రీం నిరాకరణ

నీట్‌ వ్యవహారంపై తాజాగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేసేందుకు నిరాకరించింది.

Updated : 21 Jun 2024 14:29 IST

దిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష 2024’ పేపర్‌ లీక్‌ అయ్యిందని తేలడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం.. కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేసేందుకు నిరాకరించింది. జులై మొదటి వారంలో నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కానున్న సంగతి తెలిసిందే.

నీట్‌ పరీక్ష వ్యవహారంపై దర్యాప్తు జరిపించడంతోపాటు ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన కొత్త పిటిషన్లపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారించింది. వీటిపై దాఖలైన పిటిషన్లను జులై 8 నుంచి విచారించనున్నందున.. జులై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం.. తాజాగా దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఎన్‌టీఏకు నోటీసులు జారీ చేసింది. వీటిని పెండింగ్‌ పిటిషన్లతో కలిపి జులై 8న విచారిస్తామని పేర్కొంది.

ఆదివారమే లీక్‌.. ఆ వెంటనే డార్క్‌ నెట్‌లో: ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి

మరోవైపు మేఘాలయలోని ఓ పరీక్ష కేంద్రంలో నీట్‌కు హాజరైన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రంతోపాటు ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. పరీక్ష సమయంలో తాము 45 నిమిషాలు నష్టపోయామని, గ్రేస్‌ మార్కులు పొందిన 1563 అభ్యర్థుల జాబితాలో తమను చేర్చి.. జూన్‌ 23న నిర్వహిస్తోన్న పరీక్షకు అవకాశం కల్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని